ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా వాతావరణం గణనీయంగా మారింది. పగటిపూట ఎండలు మండిపోతుండగా, రాత్రిళ్లు చలిగాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 33.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ పరిస్థితులు ఎండల తీవ్రత ముందుగానే మొదలయ్యే సూచనలు ఇస్తున్నాయి.

Heatwave Alert
రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పగటిపూట ఎండలు ఎక్కువగా ఉండగా, రాత్రికి వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. చలిగాలుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవడం విశేషంగా మారింది. ఇది వాతావరణంలో ఉన్న అస్థిరతకు నిదర్శనంగా భావిస్తున్నారు.
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది. మంగళవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ చలిగాలులు తీవ్రంగా వీస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరో రెండు నుంచి మూడు వారాల పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతుందని అంచనా. సాధారణంగా శివరాత్రి తర్వాత చలి తగ్గినా, ఈసారి ఆలస్యంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు కొనసాగుతుండగా, ఆ తర్వాత సూర్యుడి ప్రతాపం మొదలవుతోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా పొగమంచు కమ్మేస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: