AP Egg Prices Fall: ఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్‌సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 5 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో కేవలం సగం మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. మిగిలిన 2.5 కోట్ల గుడ్లను ఇతర రాష్ట్రాలతో విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇటీవల స్థానిక వినియోగం తగ్గడంతో ఎగుమతులు మందగించాయి. చెన్నై పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే కోడిగుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ అంతర్జాతీయ పరిణామం నేరుగా ఏపీలోని పౌల్ట్రీ మార్కెట్‌ను దెబ్బతీసింది.
Read Also: Indrakeeladri: శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

పెట్టుబడులు రాని స్థితిలో రైతులు
గతేడాది డిసెంబర్‌లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ. 678 పలికింది. అప్పట్లో ఒక్కో గుడ్డు రిటైల్ ధర రూ. 8 వరకు ఉండేది. కానీ ఇప్పుడు హోల్‌సేల్ ధర రూ. 4.20కి పడిపోవడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లోనైతే ఈ ధర రూ. 3.30కి కూడా పడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో పౌల్ట్రీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు భారీగా తగ్గినప్పటికీ, రిటైల్ మార్కెట్‌లో వినియోగదారులకు ఆ ప్రయోజనం అందడం లేదు. కిరాణా దుకాణాలు, చికెన్ సెంటర్లలో ఇప్పటికీ ఒక్కో గుడ్డును రూ. 5 నుండి రూ. 6 వరకు విక్రయిస్తున్నారు. మధ్యవర్తులు లాభపడుతున్నా, అటు రైతుకు, ఇటు సామాన్యుడికి మాత్రం నష్టమే మిగులుతోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ఎగుమతులు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: