ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుండి రైల్వే రంగంలో మరింత మద్దతు అందుతోంది. కేంద్రంలో మరియు రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రభుత్వాలే వలన కేంద్ర సహకారం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి పడుతోంది. ఈ సందర్భంలో రెండు కీలక రైల్వే ప్రాజెక్టులు – నడికుడి-శ్రీకాళహస్తి మరియు కోటిపల్లి-నరసాపురం – పునరుజ్జీవనాన్ని పొందుతున్నాయి.

కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ – కోనసీమ ప్రజల కల
కోనసీమ మొత్తానికి కీలకమైన కోటిపల్లి – నరసాపురం రైల్వేలైను ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటోంది. ఈ లైను పూర్తయితే మొత్తం కోనసీమ ప్రాంతాన్ని చుట్టేయొచ్చు. 18 గ్రామాలమీదుగా సాగే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతుండటంతో చాలామంది ఇళ్లు కట్టేసుకున్నారు. దీంతో రైల్వే లైన్ అలైన్ మెంట్ ను మార్చాల్సి వచ్చింది. కొత్త రైల్వే లైను 60 కిలోమీటర్లకు పెరిగింది. అయితే పాత మార్గమే కొనసాగించాలని కొందరు అన్నదాతలు కోరుతుండగా, కొత్త మార్గం కొనసాగించాలని మరికొందరు రైతులు కోరుతున్నారు.
నడికుడి – శ్రీకాళహస్తి ప్రాజెక్టు
నడికుడి -శ్రీకాళహస్తి రైల్వే లైనుకు సంబంధించి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పూర్తిగా రైల్వే లైను నిర్మాణం జరుపుకుంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రం పనులు ప్రారంభం కాలేదు. భూమిని అందజేస్తే వెంటనే పూర్తిచేస్తాం సేకరించాల్సిన భూమి ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు ఆలస్యమవుతూ వస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి తిరుపతికి, విజయవాడ నుంచి చెన్నైకి ప్రత్యామ్నాయ రైల్వేలైనుగా మారుతుంది. ప్రకృతి విపత్తుల సమయంలో ఈ రైల్వేలైను అక్కరకొస్తుంది. అధికారులు చెబుతున్నట్లుగా, అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందజేస్తే, ఈ ప్రాజెక్టును తక్కువ సమయంలోనే పూర్తి చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు.
వెనకబడిన ప్రాంతాలకు సౌలభ్యం
ఈ రైల్వే లైన్ల నిర్మాణంతో పట్టణాలకే కాదు, పల్లె ప్రాంతాలకూ అభివృద్ధి కలగనుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి, పొదిలి వంటి వెనకబడిన ప్రాంతాలకు ఇది ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ద్వారంగా నిలవనుంది. రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాక, నూతన ఉపాధి అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు ఇది బలమైన పునాది వేస్తుంది.
గుంటూరు-సికింద్రాబాద్ మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనులు కూడా పూర్తయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, సికింద్రాబాద్ నుంచి చెన్నైకి అతి తక్కువ సమయంలో చేరుకునే వీలుంటుంది. అవసరమైనచోట రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సత్వరమే భూమిని అందజేస్తే పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తిచేసి రైల్వే లైనును అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.