శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘోర ఘటన చోటుచేసుకుంది. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దేది స్కూల్ కావాలి కానీ, అక్కడే అప్రతిష్ఠకర ఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక జీనియస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు అనిత చిన్నారులపై ప్రవర్తించిన తీరు ప్రస్తుతం జిల్లా మొత్తంలో సంచలనం రేపుతోంది.

పిల్లలపై శారీరక దాడి
ధర్మవరంలోని జీనియస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఒకరోజు హోం వర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయురాలు అనిత తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ కోపంలో ఉపాధ్యాయురాలు అనిత వారిని చెప్పుతో కొట్టారు. తీరా తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇంటికి తీసుకెళ్లిన తర్వాతే ఈ దాడి విషయం తెలిసింది.
తల్లిదండ్రుల ఆగ్రహం
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఊరుకోలేదు. వెంటనే పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయురాలిని నిలదీశారు. పిల్లలు హోం వర్క్ చేయకపోతే చెప్పుతో కొట్టడమేంటి?, ఇదేనా బోధనా విధానం? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించారు. మానవత్వం కోల్పోయిన ఉపాధ్యాయురాలిపై నేరుగా దాడికి దిగారు. ఈ ఉదంతం కారణంగా పాఠశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాఠశాల వద్ద జరుగుతున్న ఉద్రిక్తత సమాచారం వన్‌టౌన్ పోలీసులకు చేరింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి శాంతింపజేశారు. స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎంఈవో గోపాల్ నాయక్ స్పందించారు. విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు.
Read also: Ontimitta temple: నేడు ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణోత్సవం