సౌత్ సినిమాల క్రేజ్ – బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
భారతీయ సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీకి, ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలకు దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ‘బాహుబలి’ సిరీస్ విడుదలైన తరువాత దేశంలో తెలుగు సినిమాలపై ఆదరణ అమాంతంగా పెరిగింది. ఆపై వచ్చిన ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కేజీఎఫ్’ వంటి పాన్-ఇండియా సినిమాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాయి.
అయితే, ఈ స్థాయిలో విజయాలు సాధించిన సినిమాలపై కొందరు బాలీవుడ్ ప్రముఖులు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డు విన్నర్, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనంత్ మహదేవన్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
“ప్రేక్షకులకు ఛాయిస్ లేకపోవడం వల్లే విజయం” – అనంత్ కామెంట్స్
తాజాగా తమిళ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ మహదేవన్ సౌత్ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలు ఎంతగా హిందీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా, అవి అసలు గొప్ప సినిమాలు కావన్నది ఆయన అభిప్రాయం. ప్రేక్షకులకు మరే ఇతర ఎంపిక లేకపోవడం వల్లే ఆ సినిమాలు పెద్ద విజయాలు అయ్యాయని ఆయన ఆరోపించారు.
“ఒకప్పుడు బాలీవుడ్‌లో మసాలా సినిమాలు – యాక్షన్, కామెడీ, రొమాన్స్ వంటి అన్ని అంశాలతో కూడిన సినిమాలు ఎక్కువగా వచ్చేవి. కానీ ప్రస్తుతం ఆ తరహా చిత్రాలు తగ్గిపోయాయి. బాలీవుడ్ తరచూ ప్రయోగాత్మక చిత్రాల వైపు మొగ్గుచూపుతోంది. దీని వల్లే ప్రేక్షకులు బాహుబలి, పుష్ప వంటి సౌత్ సినిమాలను చూడటానికి వెళ్తున్నారు. మరే చాయిస్ లేకపోవడం వల్లే ఈ సినిమాలు హిట్ అయ్యాయి. మంచి వసూళ్లు వచ్చాయంటే గొప్ప సినిమా అని అనుకోవడం పొరపాటే” అని ఆయన వ్యాఖ్యానించారు.
సినీ ప్రియుల ప్రతిస్పందన
అనంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ ప్రేక్షకులు, సోషల్ మీడియాలో పలువురు స్పందన. చాలామంది ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. “ఒక సినిమా సృష్టించిన ఇంపాక్ట్‌ను వసూళ్ల ద్వారా మాత్రమే అర్థం చేసుకోవడం సరైన దృక్కోణం కాదు. బాహుబలి ఒక విజువల్ వండర్. పుష్పలో అల్లు అర్జున్ పోషించిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విజయం అనేది ప్రేక్షకుల అభిమానంతో, కథా నిర్మాణంతో, దర్శక ప్రతిభతో ముడిపడి ఉంటుంది. ఛాయిస్ లేకపోయిన సినిమాలు ఒకటి రెండు రోజులు నడుస్తాయి. వారాల తరబడి థియేటర్లలో ఆడడం, వసూళ్ల రికార్డులు బద్దలు కొట్టడం సాధారణం కాదు” అని పలువురు అభిప్రాయపడ్డారు.
సినిమా విజయానికి ప్రేక్షకుడే న్యాయనిర్ణేత
ప్రేక్షకులు సినిమా చూసే సరికి కథ, నటన, బి.జి.ఎం, నిర్మాణ విలువలు, దర్శకుని విజన్ వంటి అంశాలన్నీ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ‘బాహుబలి’ భారతీయ చిత్రసీమను ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది. ‘పుష్ప’ లోని ఫైటింగ్ సీక్వెన్స్‌లు, పాటలు, నటన సామర్థ్యం ప్రేక్షకులను మెప్పించాయి. అంతేగానీ, కేవలం ఛాయిస్ లేక సినిమాలు చూడటం అనేది పూర్తి అవాస్తవం.
సినిమా ఒక ఆర్ట్ ఫామ్. అందులో విజయం అంటే కేవలం వసూళ్లే కాదు, ప్రజల మదిలో నిలిచిపోయే ప్రదర్శన కూడా. దానికి ఉదాహరణలే ఈ సౌత్ సినిమాలు.
READ ALSO: Raj Tharun: ‘పాంచ్ మినార్’ టీజర్ విడుదల