వ్యాపార ప్రపంచంలో ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఏంటంటే దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో లిస్టులో చోటు కోల్పోయారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆయన నికర ఆస్తుల విలువ లక్ష కోట్లు తగ్గడంతో ఇలా జరిగింది. ఈ సమాచారం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ద్వారా వెల్లడైంది. మరోవైపు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఎప్పటిలాగే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఐటీ కంపెనీ HCLకి చెందిన రోష్ని నాడార్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ ధనవంతురాలైన మహిళగా నిలిచారు. ఆమె ఆస్తులు రూ.3.5 లక్షల కోట్లకు పైమాటే. ప్రపంచంలోని టాప్ 10 మహిళలలో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ మహిళ కూడా రోష్ని నాడార్.

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్
ముఖేష్ అంబానీ ఇప్పటికీ భారతదేశం అలాగే ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ప్రస్తుతం అంబానీ కుటుంబం ఆస్తుల విలువ 8.6 లక్షల కోట్లు. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే అతని సంపద దాదాపు 13 శాతం అంటే రూ. లక్ష కోట్లు తగ్గింది. మరోవైపు గౌతమ్ అదానీ ఇంకా అతని కుటుంబ సంపద 13% పెరిగింది. గత ఏడాది కాలంలో అదానీ నికర ఆస్తుల విలువ లక్ష కోట్లు పెరిగింది.
టాప్ 10 లో ఎవరు ఉన్నారు
సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ సంపద 21% పెరిగి ఇప్పుడు అతని సంపద రూ.2.5 లక్షల కోట్లుగా ఉంది. అతను ఈ లిస్టులో నాల్గవ స్థానాల్లో ఉన్నారు. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ రూ.2.2 లక్షల కోట్లతో ఐదవ స్థానంలో, కుమార్ మంగళం బిర్లా రూ.2 లక్షల కోట్లతో ఆరో స్థానంలో ఉండగా 2 లక్షల కోట్ల నికర విలువతో సైరస్ పూనావాలా ఆరో స్థానంలో ఉన్నారు.