ఇల్లంతా సక్రమంగా నడవాలంటే మహిళ ఆరోగ్యంగా ఉండడం అత్యంత అవసరం. ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే మహిళలకు ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో, 30 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దాంతో పాటు హార్మోన్ల లోపాలు, జీవనశైలి మార్పులు కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వైద్య నిపుణులు ఈ వయసులోని మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

రొమ్ము క్యాన్సర్ టెస్ట్‌లు తప్పనిసరి
ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ (HPV స్క్రీనింగ్), రొమ్ము క్యాన్సర్ టెస్ట్‌లు తప్పనిసరిగా చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ టెస్టులు వల్ల మొదటి దశలోనే వ్యాధిని గుర్తించి తక్షణమే చికిత్స చేపట్టవచ్చు. అలాగే, మధుమేహం (బ్లడ్ షుగర్) మరియు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కూడా సకాలంలో పరీక్షించుకోవాలి. ఇవి గుండె సంబంధిత వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉన్నందున ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది
అందుకే, 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా సంవత్సరానికి కనీసం ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాన్ని సకాలంలో చూసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్ద వ్యాధులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ, సమయానికి స్క్రీనింగ్‌లు, టెస్టులు చేయించుకుంటూ ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.