ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి సత్తా చాటింది. బౌలర్లతో పాటు బ్యాటర్లూ సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ప్రత్యర్థిపై 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సీజన్ ఆరంభంలో ఢిల్లీ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలన్న లక్నో ఆశలపై నీళ్లు చల్లుతూ.. ఆ జట్టు నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే దంచేసింది. రాహుల్ (42 బంతుల్లో 57 నాటౌట్, 3ఫోర్లు, 3సిక్స్‌లు), అభిషేక్ పొరెల్ (36 బంతుల్లో 51, 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. తొలుత లక్నో ఢిల్లీ బౌలర్ల ధాటికి 159/6కే పరిమితమైంది. మార్క్మ్ (33 బంతుల్లో 52, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆల్‌రౌండ్ (బంతితో 2/30) మెరుపులు వృథా అయ్యాయి. క్యాపిటల్స్ బౌలర్ ముకేశ్ కుమార్ (4/33) లక్నోను దెబ్బతీశాడు. కాగా, 8 మ్యాచుల్లో దిల్లీ క్యాపిటల్స్ కు ఇది ఆరో విజయం. 9 మ్యాచులు ఆడిన లక్నోకు ఇది నాలుగో ఓటమి.
సిక్సర్
స్వల్ప ఛేదనను ఢిల్లీ దూకుడుగా ఆడి 17.5 ఓవర్లలోనే దంచేసింది. యువ ఓపెనర్ పొరెల్.. రాహుల్‌తో పాటు అక్షర్ పటేల్ (34 నాటౌట్) ధనాధన్ మెరుపులతో లక్ష్యం మరింత చిన్నదైంది. రెండు బౌండరీలు, ఓ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను వేగంగా మొదలుపెట్టిన కరుణ్ నాయర్ (15) మార్క్మ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరినా ఈ త్రయం దంచడంతో లక్నోకు ఓటమి తప్పలేదు. పొరెల్ తొలి ఓవర్ నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. బిష్ణోయ్ 11వ ఓవర్లో 83 మీటర్ల భారీ సిక్సర్‌తో పొరెల్ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.ఇదే ఓవర్లో రాహుల్ కూడా 86 మీటర్ల సిక్సర్ బాదాడు. అయితే మార్క్మ్ 12వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన పొరెల్ డీప్ మిడ్ వికెట్ వద్ద మిల్లర్ చేతికి చిక్కడంతో 69 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. పొరెల్ నిష్క్రమించినా అక్షర్ దూకుడు ఆపలేదు. బిష్ణోయ్ 14వ ఓవర్లో అతడు రెండు భారీ సిక్సర్లు బాదిన అక్షర్.. దిగ్వేశ్ బౌలింగ్‌లోనూ బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. తన మాజీ జట్టు అయిన లక్నోపై రాహుల్ రాణించడం మ్యాచ్‌లో కొసమెరుపు.

మంచి రిథమ్
అక్షర్ పటేల్ మాట్లాడుతూ,బౌలింగ్‌తో మేం ప్రారంభించిన తీరు బాగుంది. వికెట్లు పడకపోయినా, మేము గేమ్‌ను కంట్రోల్‌లో ఉంచగలిగాం. రెండు వికెట్లు వరుసగా తీసిన తర్వాత గేమ్ లో మూమెంట్ వచ్చింది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని 160 కన్నా తక్కువ పరుగులకే కట్టడి చేశారు. నాకు చిన్న గాయం ఉంది. అందుకే ఇప్పటివరకు ఎక్కువగా బౌలింగ్ చేయలేకపోయాను. ఒకవేళ నా నాలుగు ఓవర్ల కోటా బౌలింగ్ చేస్తే, మ్యాచులకు దూరం అవ్వాల్సి వస్తుంది. కానీ ఈరోజు మంచి రిథమ్‌లో ఉన్నానని అనిపించింది, అందుకే ముందుగానే బౌలింగ్‌కు వచ్చాను. బౌలింగ్ మార్పులు చేసేటప్పుడు మ్యాచ్-అప్స్‌ను పరిగణలోకి తీసుకున్నాను. అందుకే బౌలర్లను రొటేట్ చేస్తూ ఆడించాను. వాళ్లందరూ పరిస్థితికి తగ్గట్టుగా బాగా బౌలింగ్ చేశారు.”నేను బ్యాటింగ్‌కు దిగినప్పుడల్లా నా బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడతాను. ఏ స్థానంలో ఆడుతున్నా అనేది పట్టించుకోను. ఒక బౌలర్‌ను టార్గెట్ చేయాలని అనుకున్నప్పుడల్లా నాకు మంచి ఫలితాలే వచ్చాయి. ఫీల్డింగ్‌లో మేము ఇంకా కాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కీలక మ్యాచ్‌లలో క్యాచ్‌లు వదులితే అది గేమ్‌పై ప్రభావం చూపించొచ్చు.” అని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు.
Read Also: David Warner: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్