విదేశీ విద్యార్థులపై అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐతో నిఘా పెడుతోంది. హమాస్ అనుకూల ఉగ్రవాద గ్రూపులకు సపోర్డ్ చేస్తున్న విదేశీ విద్యార్థులను గుర్తించడానికి, వారిపై నిఘా పెట్టడానికి ట్రంప్ సర్కార్ ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద గ్రూపులకు అనుకూల పోస్ట్‌లు, స్టోరీలకు ఇన్‌స్టాలో లైక్ కొట్టినా దొరకపట్టేలా నిఘా యంత్రాంగం సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించాయి.
విదేశాంగశాఖ హెచ్చరికలు జారీ
వివిధ యూనివర్సిటీల్లోని క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు- అక్కడి విదేశాంగశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్న వారినే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపినట్లు అధికారులు వెల్లడించాయి. ఈనేపథ్యంలో ఈ విదేశీ విద్యార్థులపై ఏఐతో నిఘా పెడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్ట్‌లు చేసిన వారిపై చర్యలు
ఆమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నాయకత్వంలో అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు వారికి మద్దతుగా ఎవరెవరు సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్ట్‌లు చేశారు? ఎవరు వాటిని లైక్, షేర్ చేశారు? అనే విషయాలు తెలుసుకోవడానికి విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లను స్కాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘పోస్ట్ డిలీట్ చేసినా వదలం!’
విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై కొంత కాలంగా ఏఐ నిఘా కొనసాగుతోందని యాక్సియోస్ నివేదిక ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా విద్యార్థులు వారు చేసిన పోస్ట్‌లను తొలగించినప్పటికీ ప్రభుత్వ విభాగాల వద్ద వాటి స్క్రీన్షాట్లు ఉంటాయని నివేదిక వెల్లడించింది.

లక్షకుపైగా విదేశీయుల ప్రొఫైల్‌లను ఫెడరల్ అధికారులు స్కాన్
గత ప్రభుత్వ హయాంలోనే బహిష్కరణ వేటు పడినప్పటికీ అమెరికాలోనే ఉంటున్న అక్రమ వలసదారులను(విద్యార్థులు) గుర్తించడానికి కూడా ట్రంప్ సర్కార్ వీటిని ఉపయోగిస్తోంది. అందులో భాగంగా ఇప్పటి వరకు లక్షకుపైగా విదేశీయుల ప్రొఫైల్‌లను ఫెడరల్ అధికారులు స్కాన్ చేసినట్లు సమాచారం. ఓపెన్ డోర్స్ అనే నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికా రికార్డు స్థాయిలో 11 లక్షల అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చింది. వీరిలో 3 లక్షలకు పైగా భారత్ నుంచి ఉన్నారు.
ట్రంప్ అమెరికా వ్యతిరేకులపై ఉక్కుపాదం!
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలిచి అధికారం చేపట్టిన నాటి నుంచి అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న అన్ని విషయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగానే జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న వారి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా విదేశాంగశాఖ చెక్ చేస్తోంది. ఒకవేళ అదే నిజమని తేలితే ఆ విద్యార్థులకు అమెరికాలో చదువుకునే వీల్లేకుండా తక్షణమే వారి సొంత దేశాలకు పంపించేందుకు సిద్ధం అవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. హమాస్ అనుకూల ఉగ్రవాద గ్రూపులకు మద్దతుగా పోస్ట్‌లు, స్టోరీలు షేర్ చేసిన విదేశీ విద్యార్థులపై కొత్త రూల్స్ అమలు. ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ కొట్టినా లేదా పోస్టులు షేర్ చేసినా, వారికి సవాలు ఎదురవ్వవచ్చు.