ఐటీ కారిడార్ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైవంతెన నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ పైవంతెన ట్రిపుల్ ఐటీ చౌరస్తా, కోకాపేట ఓఆర్ఆర్ చౌరస్తా మధ్య రానుంది. ఈ వంతెనను తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. ఈ సంస్థ సర్వే పనులను కూడా చేపట్టింది. వరద వ్యవస్థ, వాహన రద్దీ, నేల స్వభావం, ఇతర పరీక్షలకు కన్సల్టెన్సీని ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది.
రెండున్నరేళ్లలో అందుబాటులోకి ఫ్లైఓవర్
3 నెలల పాటు అధ్యయనం చేసి, తర్వాతి రెండున్నరేళ్లలో పైవంతెనను అందుబాటులోకి తీసుకురావాలని టీజీఐఐసీ లక్ష్యంగా పెట్టుకుంది. పై వంతెన నిర్మాణ పనులు పూర్తయితే నగరంలో రెండో పొడవైన పైవంతెనగా నిలుస్తుంది. ట్రిపుల్ ఐటీ చౌరస్తా నుంచి కోకాపేట (జీఏఆర్ చౌరస్తా) వరకు లక్షకు పైగా వాహనాలు రోజూ రాకపోకలు సాగిస్తున్నాయి.
ఫ్లైఓవర్ ఎవరికి ఉపయోగం
నల్లగండ్ల, గోపన్‌పల్లి, గౌలిదొడ్డి ప్రాంతాల నుంచి విప్రో చౌరస్తా మీదుగా నియో పొలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ సంస్థలకు వెళ్లే వాహనదారులకు. నిజాంపేట, మియాపూర్, హఫీజ్‌పేట, కొండాపూర్, గచ్చిబౌలి, డీఎల్‌ఎఫ్ తదితర ప్రాంతాల నుంచి ట్రిపుల్ ఐటీ కూడలి మీదుగా నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లే ఐటీ ఉద్యోగులకు. ఆయా ప్రాంతాల వారు కూడళ్ల వద్ద ఆగకుండా పైవంతెనపైకి ఎక్కి నేరుగా కార్యాలయాలకు చేరుకోవచ్చు.