బెంగళూరు నివాసితుడు ఎస్.సతీష్ అలియాస్ డాగ్ సతీశ్ అసలు కథ బయటపడింది. సతీష్ ఇటీవల రూ.50 కోట్లు వెచ్చించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్క వోల్ఫ్‌డాగ్‌ను కొన్నానని ప్రచారం చేసుకున్నారు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సతీష్ పై ఈడీ అధికారులకు ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందాయి. వాటిలో హవాలా, అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో భాగంగా షాకింగ్ విషయాలు గుర్తించారు.
‘కాడబోమ్స్ ఒకామి’ అనే కుక్క
అమెరికా నుంచి ‘కాడబోమ్స్ ఒకామి’ అనే కుక్కను కొన్నానని, అది అరుదైన తోడేలు కుక్క అని సతీశ్ చెప్పాడు. ఈ జాతి తోడేలు, కాకేసియన్ షెపర్డ్ మిశ్రమం అని ప్రచారం చేసుకున్నాడు. అలాంటి కుక్క ఇండియాకు రావడం ఇదే తొలిసారి అని ఊదరగొట్టాడు. దీంతో బెంగళూరులోని జేపీ నగర్‌లోని సతీష్ ఇంటిపై ఈడీ అధికారులు సోదాలు జరిపారు. రూ.50 కోట్ల విలువైన కుక్కను కొనుగోలు చేయలేదని, అలాంటి పత్రం లేదా రుజువు ఏదీ తన దగ్గర లేదని తేల్చారు. మీడియాలో ఫేమస్ అయ్యేందుకే సతీష్ ఇదంతా చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.
దర్యాప్తులో అసలు విషయాలు
అంతేకాదు ఆ కుక్కను చూపించమని సతీష్‌ని అధికారులు అడిగారు. కానీ ఆ కుక్క కూడా తనది కాదని, తన స్నేహితుడి దగ్గర ఉందని చెప్పాడు. సతీష్ తనను తాను పెద్ద కుక్కల పెంపకందారునిగా చెప్పుకుంటాడు. కానీ దర్యాప్తులో అతను ఆర్థికంగా బలహీనుడని, కోట్ల విలువైన కుక్కను కొనగలిగే ఆస్తి లేదా ఆదాయం అతనికి లేదని ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. సతీశ్‌పై ఫిర్యాదుల ఆధారంగా ఈడీ అతని ఆదాయం, ఖర్చులపై దర్యాప్తు జరిపింది. సతీష్ అబద్ధాన్ని ఎందుకు వ్యాప్తి చేశాడో తెలుసుకోవడానికి ఈడీ ఎంక్వైరీ చేసింది. వాస్తవానికి అతనికి అంత సీన్ లేదని అధికారులు తేల్చినట్లు సమాచారం.
Read Also: Bengal : టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట