మన వంటగదిలో ఉండే వాటిల్లో గోధుమపిండి కూడా ఒకటి. రోటీ, పరాఠా, స్వీట్స్ వంటి వివిధ రకాల వంటకాలను దీనితో తయారు చేస్తూ ఉంటాం. ఇక ఈ గోధుమపిండిని (Wheat Flour)చాలా మంది ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తూ ఉంటారు. అయితే సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల గోధుమపిండి పురుగులు పట్టడం, ముద్దలు కట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. పురుగులు పట్టిన పిండితో మనం ఎలాగూ రోటీలను తయారు చేయలేం. ఇది వాడడానికి కూడా అనుకూలంగా ఉండదు. పిండిని సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల ఉష్ణోగ్రతల్లో తేడాలు వచ్చి తేమలో వచ్చే మార్పుల వల్ల కీటకాలు పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కనుక గోధుమపిండిని (Wheat Flour)సరైన పద్దతిలో నిల్వ చేసుకోవడం చాలా అవసరం. కొన్ని చిట్కాలను ఉపయోగించడం వల్ల గోధుమపిండి పాడవకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ చేసుకోవచ్చు. గోధుమపిండిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుంది. గాజు పాత్రలో లేదా గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి మూత పెట్టి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయాలి. తేమ లోపలికి వెళ్లకుండా మూత గట్టిగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఇలా చేయడం వల్ల పిండి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుంది. తేమ కారణంగా పిండి త్వరగా చెడిపోతుంది. కనుక పిండిని స్టీల్ డబ్బాలో ఉంచి నిల్వ చేయాలి. స్టీల్ డబ్బాలో నిల్వ చేసే ముందు దానిలో తడి లేకుండా చూసుకోవాలి. డబ్బాను ఎండలో ఆరబెట్టడం వల్ల తేమ లేకుండా పొడిగా అవుతుంది. అలాగే పిండిలో 4 లేదా 5 టీ స్పూన్ల ఉప్పును కలిపి నిల్వ చేయాలి. ఇలా చేయడం వల్ల కీటకాలు పిండిలోకి వెళ్లకుండా నిరోధించవచ్చు.
Read Also : http://Healthy Eating: జొన్న రొట్టెలు తింటే కలిగే ఆరోగ్య లాభాలు

స్టీల్ డబ్బాలో సగం వరకు పిండి వేసి అందులో 2 లేదా 3 టీ స్పూన్ల ఉప్పు కలపాలి. తరువాత మిగిలిన పిండి వేసి అందులో 1 లేదా 2 టీ స్పూన్ల ఉప్పు వేసి కలిపి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి పురుగులు పట్టకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది. ఉప్పుకు బదులుగా పిండిలో బగారా ఆకులు వేసి కూడా నిల్వ చేసుకోవచ్చు. బగారా ఆకులకు ఉండే వాసన పిండి పురుగు పట్టకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇక పిండిని కొనుగోలు చేసే ముందు తయారీ తేదీని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఒక నెల కంటే ముందు తయారైన పిండిని కొనుగోలు చేయకపోవడమే మంచిది. తయారీ తేదీ ఒక నెల లోపు ఉన్న పిండిని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల పిండి ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మనం గోధుమపిండిని పాడవకుండా ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండేలా నిల్వ చేసుకోవచ్చు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: