CPI Protest: రాష్ట్రవ్యాప్తంగా మెడికల్, ఫార్మా రంగాల్లో నెలకొన్న మాఫియా ధోరణులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య(Guzzula Eswaraiah) తెలిపారు. ఈ ప్రజా ఉద్యమంలో ప్రజలు, మెడికల్ రంగంలోని నిరుద్యోగ యువత, ప్రజా సంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ రంగం ఒక పెద్ద మాఫియాగా రూపాంతరం చెందిందని, నకిలీ మందుల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read also: Andhra Pradesh: అంబటి రాంబాబుపై మరో పీటీ వారంట్

ఈ నెల 14న ప్రజా ఉద్యమం
ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఆందోళనలకు సంబంధించిన పోస్టర్ను విజయవాడ దాసరి భవన్లో పార్టీ నాయకులతో కలిసి బుధవారం ఈశ్వరయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మెడికల్, ఫార్మా మాఫియాను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బోగస్ మందుల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ వైద్య సేవలు సామాన్యులకు అందని స్థితికి చేరుకున్నాయని, అనవసర పరీక్షలు, మందులు సూచించి వ్యాపార దృష్టితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
ఫార్మా కంపెనీలు లాభాపేక్షతో నాణ్యతా ప్రమాణాలను విస్మరిస్తున్నాయని, ప్రజారోగ్యాన్ని వ్యాపారంగా మార్చే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. పిపిపి పేరిట వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే చర్యలు ప్రభుత్వం చేపడుతోందని, దీనివల్ల ప్రభుత్వ వైద్యసంస్థలు నిర్వీర్యమవు తున్నాయని విమర్శించారు. రోగాల వారీగా చికిత్స ఖర్చులు, మందుల ధరలు, ఫీజులు నిర్ధారించే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ప్రజా ఉద్యమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటించి, సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కోరారు.
మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించిందని, 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని విమర్శించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసమే చట్టాలు మార్పు చేశారని ఆరోపించారు. సిపిఐ శ్రేణులు, ప్రజా సంఘాలు విస్తృతంగా పాల్గొని సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి, పి.దుర్గాభవాని, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: