తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం వద్ద రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న ఆయన నివసానికి చేరుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు, గేటుకు నోటీసులు అంటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. గత కొంతకాలంగా విచారణ వేదికపై నెలకొన్న సందిగ్ధతకు ఈ నోటీసుతో అధికారులు తెరదించినట్లయింది.
Telangana: కేసీఆర్ తో KTR భేటీ
ఈ విచారణను కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కాకుండా నందినగర్ నివాసంలోనే ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారో అధికారులు నోటీసులో వివరణ ఇచ్చారు. తమ అధికారిక రికార్డుల ప్రకారం కేసీఆర్ అడ్రస్ నందినగర్‌గానే నమోదై ఉందని, అందుకే అక్కడే విచారణ జరుపుతామని తెలిపారు. విచారణను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన భారీ ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యుమెంట్లు మరియు రికార్డింగ్ సామాగ్రిని ఫామ్‌హౌస్ వరకు తరలించడం సాంకేతికంగా సాధ్యం కాదని సిట్ అధికారులు స్పష్టం చేశారు. విచారణ ప్రక్రియను పక్కాగా రికార్డు చేయాల్సి ఉన్నందున నందినగర్ నివాసమే అనువైనదని వారు పేర్కొన్నారు.

మరోవైపు, కేసీఆర్ ఇప్పటికే తన ఆరోగ్య కారణాల దృష్ట్యా లేదా ఇతర కారణాలతో ఫామ్‌హౌస్‌లోనే విచారణకు హాజరవుతానని గతంలో సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, సిట్ అధికారులు ఇప్పుడు నేరుగా ఆయన నివాసానికే నోటీసులు ఇవ్వడంతో ఆయన తదుపరి అడుగుపై ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 1న కేసీఆర్ ఈ విచారణకు అందుబాటులో ఉంటారా లేక చట్టపరమైన ఇతర మార్గాలను అన్వేషిస్తారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నోటీసుల నేపథ్యంలో నందినగర్ వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com