ఆధ్యాత్మిక క్షేత్రాలు అనగా భక్తి, సమానత్వం, వినయం, త్యాగం వంటి విలువలకు ప్రతీకలుగా ఉండవలసినవి. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువైన తిరుమల తిరుపతి (Tirupati)దేవస్థానం వంటి క్షేత్రాలు సామాన్య భక్తుని మనసులో దేవుని సన్నిధిని ప్రత్యక్షంగా అనుభూతి కలిగిం చాలి. కానీ నేటి పరిస్థితులు సామాన్య భక్తుడికి తీవ్రమైన పరీక్షగా మారుతున్నాయి. తిరుపతిలో (Tirupati)స్వామివారి దర్శనం కోసం ఇరవై నాలుగు గంటలు, నలభై ఎనిమిది గంటలు క్యూలైన్లలో వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలతో వచ్చే భక్తులకు ఇది శారీరకంగా మాత్రమే కాక మానసికంగా కూడా తీవ్రమైన వేదనగా మారుతోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా దర్శన విధానాలలో పెరుగుతున్న అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యం గా వీఐపీ దర్శనాల సంఖ్య నియంత్రణ లేకుండా పెరగడంవలన సామాన్య భక్తుడి అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. హోదా కలిగిన వ్యక్తులు తరచుగా దర్శించుకోవడం ఒక సాధారణ వ్యవహారంగా మారిపోయింది. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సిఫారసు లేఖలతో వచ్చే వారికి కూడా అదే ప్రత్యేక సౌకర్యాలు కల్పించబడటం మరింత ఆందోళనక రమైన విషయం. దీని వలన దర్శన వ్యవస్థ భక్తి ఆధారంగా కాకుండా పలుకుబడి, పరిచయాల ఆధారంగా నడుస్తున్న దన్న భావన ప్రజల్లో బలపడుతోంది. భగవంతుని దృష్టిలో అందరూ సమానులనే భావనహిందూ ధర్మానికి మూలసిద్ధాంతం.
Read Also : Karnataka: ప్రపంచంలోనే అత్యంత రెండో ట్రాఫిక్ రద్దీ నగరంగా బెంగళూరు

అందరూ సమానులే
దేవుని ముందు రాజు, పేద వాడు అనే తేడా లేదని మన శాస్త్రాలు స్పష్టంగా బోధించా యి. అటువంటి ధార్మిక నేపథ్యంతో చూసినప్పుడు ప్రత్యేక హోదాల ఆధారంగా దర్శనాల విభజన జరగడం ధర్మ సూత్రాలకు విరుద్ధంగా కనిపిస్తోంది. దేవాలయం సామాజిక హోదాల ప్రదర్శన వేదికగా మారకూడదు. ఇక్కడ ఒకఅత్యం త కీలకమైన అంశాన్ని గంభీరంగా ఆలోచించాల్సిన అవ సరం ఉంది. ఒకసారి స్వామివారి దర్శనం పొందిన భక్తు లకు కొంత నిర్దిష్ట కాలం తర్వాత మాత్రమే మరల దర్శన అవకాశం ఇవ్వాలనే విధానం తప్పనిసరిగా అమలులోకి రావాలి. పదే పదే, వారానికోసారి లేదా నెలకు పలుమార్లు అదేవ్యక్తులు దర్శించుకోవడం వలన లక్షలాదిమంది భక్తులు ఒక్కసారి దర్శనం కోసం కూడా దీర్ఘకాలం ఎదురుచూడాల్సి న పరిస్థితి ఏర్పడుతోంది. దర్శనం అనేది వ్యక్తిగత అల వాటు కాదు, అది సమూహానికి చెందిన పవిత్ర అవకాశం అనే భావనను తిరిగి బలపరచాలి. నేటి పరిస్థితుల్లో సామా న్య భక్తుడు దర్శనం పొందాలంటే తన భక్తిని కాకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన స్థితి నెలకొంది. ఇది ఆధ్యాత్మిక అనుభూతిని తీవ్రంగా దెబ్బతీస్తోంది. సిఫారసు లేఖల సంస్కృతి భక్తి విలువలను మసకబారుస్తోంది. దేవుడి సన్నిధిలో సమానత్వం ఉండాల్సిన చోట అధికారుల దగ్గర చేరుకునే సామర్థ్యమే ముఖ్యమన్న భావన సమాజంలో వ్యాపిస్తోంది. హైందవ సంప్రదాయంలో దేవాలయం సమా నత్వానికి, సామాజిక ఐక్యతకు ప్రతీక. అక్కడ కులం, వర్గం, హోదా వంటి భేదాలు ఉండకూడదు. కానీ నేటి ఆచరణలో ఇవన్నీ దర్శనాల వద్ద స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక చరిత్రను పరిశీలిస్తే మహానుభావులంతా తమను తాము దేవుని ముందు అతి చిన్నవారిగా భావించారు. అలాంటి వినయం నేటి దర్శన వ్యవస్థల్లో కనుమరుగవుతున్నది. దేవస్థాన పాలకులు, ప్రభుత్వాలు ఈ అంశాన్ని అత్యంత బాధ్యతతో పరిగణించాలి.

సమానత్వం తీసుకురావడం అత్యవసరం
దర్శనవిధానాలలో పారదర్శకత, సమానత్వం తీసుకురావడం అత్యవసరం. ఒకసారి దర్శనం పొందినవారికి కాలపరిమితి విధించడం, వీఐపీ దర్శనాలను నిజంగాఅత్యవసర సందర్భాలకు మాత్రమే పరిమితం చేయ డం వంటి సంస్కరణలు అమలైతే సామాన్య భక్తుడికి న్యాయం జరుగుతుంది. భక్తుడు దేవాలయానికి వచ్చేది ప్రశాంతత కోసం కానీ గంటల తరబడి వేచి ఉండడం. శారీ రక ఇబ్బందులు పడడంవలన ఆ ప్రశాంతత కరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో భక్తి భావం క్రమంగా తగ్గిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. దేవా లయాలు భక్తి కేంద్రాలుగా కాకుండా అధికార కేంద్రాలుగా మారితే అదిఆధ్యాత్మికంగా సమాజానికి తీవ్ర నష్టం కలిగి స్తుంది. అందుకే ఇప్పుడు సమాజం మొత్తం ఆలోచించాల్సి న సమయం వచ్చింది. దేవుడు అందరికీ సమానుడైతే దర్శన అవకాశాలు కూడా సమానంగా ఉండాలని మౌలిక సూత్రాన్ని తిరిగి స్థాపించాల్సిన అవసరం ఉంది. సామాన్య భక్తుడి కన్నీరు, అలసట, నిరాశలను పాలకులు గుర్తించిన ప్పుడే నిజమైన ఆధ్యాత్మిక సంస్కరణలు సాధ్యమవుతాయి. అప్పుడే దేవాలయాలు తిరిగి భక్తి, విశ్వాసాల కేంద్రాలుగా నిలుస్తాయి. ఇది కేవలం ఒక దేవస్థానానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇది మన ఆధ్యాత్మిక విలువల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. దీనిపై సమాజం చైతన్యంతో స్పందించాల్సిన అవసరం ఉంది.
– తరిగోపుల నారాయణస్వామి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :