తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం(Indiramma Housing Scheme) పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోంది. ఈ పథకం కింద సొంతింటి కలను సాకారం చేసుకుంటున్న సుమారు 23 వేల మంది లబ్ధిదారులకు రూ.262.51 కోట్ల నిధులు విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతం తెలిపారు. ఆధార్ ఆధారిత విధానంలో ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.
Read Also: Urban Forests : తెలంగాణ లో మరో 6 అర్బన్ ఫారెస్ట్ లు

ఇందిరమ్మ పథకం కింద కోట్ల రూపాయల విడుదల
ఇటీవల విడుదలైన నిధుల్లో, బేస్‌మెంట్ స్థాయి నిర్మాణం పూర్తి చేసిన 2,763 మంది లబ్ధిదారులు(Housing Beneficiaries), గోడలు మరియు శ్లాబ్ దశను దాటిన 20,186 మంది లబ్ధిదారులు ఉన్నట్లు ఎండీ వివరించారు. ఇండ్ల నిర్మాణ పురోగతిని బట్టి దశలవారీగా బిల్లులు మంజూరు చేస్తున్నామని, పనుల వేగానికి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ.4,351 కోట్లకు పైగా నిధులు లబ్ధిదారులకు అందజేశామని గౌతం పేర్కొన్నారు. చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తోందన్నారు.
మార్చి నాటికి లక్ష ఇండ్లు లక్ష్యం
ఈ పథకం కింద ఈ ఏడాది మార్చి నాటికి లక్ష ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ దశ పూర్తయిన అనంతరం తదుపరి దశ ఇండ్ల నిర్మాణానికి కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్న ప్రతి లబ్ధిదారునికీ బిల్లులు సకాలంలో విడుదలవుతున్నాయని ఎండీ స్పష్టం చేశారు. మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో, క్షేత్రస్థాయి తనిఖీల అనంతరం పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని గౌతం తెలిపారు. వీటిలో సుమారు 1.25 లక్షల ఇండ్లు గోడలు–శ్లాబ్ దశకు చేరువలో ఉండగా, మరో 75 వేల ఇండ్లు బేస్‌మెంట్ స్థాయిని దాటినట్లు వెల్లడించారు. నిర్మాణాల్లో నాణ్యత మరియు వేగం రెండింటిని నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్లు తరచుగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తూ, సమీక్షా సమావేశాల ద్వారా పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పేదల సొంతింటి కలను త్వరితగతిన నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని గౌతం స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: