
భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే దేశం సురక్షితంగా ఉంటుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తెలిపారు. గత 12 ఏళ్లలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయాలు సాధించిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో తొలిసారి పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దిల్లీలో నిర్వహించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, పార్టీ భవిష్యత్ దిశపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: BJP: జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

బీజేపీలో కార్యకర్తకే అత్యున్నత స్థానం: మోదీ
బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలు, ఎంపికలు పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతాయని అన్నారు. దేశసేవ, ప్రజాసేవే పార్టీ శ్రేణుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యకర్తలే కేంద్రబిందువుగా బీజేపీ సిద్ధాంతాలు ఉంటాయని, తాను బీజేపీ కార్యకర్తనని అనిపించుకోవడమే తనకు గర్వకారణమని ప్రధాని చెప్పారు.
నాయకత్వం మారినా లక్ష్యం మారదు
గతంలో ఎల్‌కే అద్వానీ, వెంకయ్య నాయుడు నేతృత్వంలో పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని మోదీ(PM Modi) గుర్తు చేసుకున్నారు. అందరి కృషితోనే బీజేపీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిందని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ నిర్మాణం బలంగా ఉందని పేర్కొంటూ, ప్రతి కార్యకర్త బాధ్యతలను జీవనశైలిగా భావించి పని చేయాలని పిలుపునిచ్చారు. నాయకత్వం మారినా లక్ష్యం మారకూడదని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. రేడియో నుంచి కృత్రిమ మేధ (AI) వరకు కొత్త సాంకేతికతను వినియోగించుకోవాలని తెలిపారు.
కొత్త రాష్ట్రాల్లోనూ బీజేపీకి అవకాశాలు
గతంలో బీజేపీ గెలవని రాష్ట్రాల్లో కూడా గత 12 ఏళ్లలో పార్టీ విజయం సాధించిందని మోదీ అన్నారు. భవిష్యత్తులో బంగాల్, తెలంగాణతో పాటు కేరళలో కూడా బీజేపీకి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతి పార్టీకి ఒక విధానం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన మోడల్‌ను అనుసరిస్తోందని విమర్శించారు. బీజేపీ మాత్రం ఎల్లప్పుడూ అభివృద్ధి కేంద్రంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
నితిన్ నబీన్‌కు అభినందనలు
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీకి అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఆయన బాధ్యత బీజేపీ నిర్వహణతోనే పరిమితం కాదని, ఎన్డీఏ మిత్రపక్షాల మధ్య సమన్వయం కూడా కీలకమని పేర్కొన్నారు.
నితిన్ నబీన్ యువశక్తి, అనుభవం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఆర్థిక, సామాజిక, సాంకేతిక మార్పులను ప్రత్యక్షంగా చూసిన తరం నుంచి వచ్చిన నాయకుడిగా ఆయన పార్టీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే 25 సంవత్సరాలు భారతదేశ భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. ఈ కాలంలోనే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాల్సి ఉందని, అది తప్పకుండా సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: