Telangana school fees : రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ట్యూషన్ ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఫీజుల నియంత్రణ చట్టాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన విధివిధానాల ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల అనంతరం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రతిపాదిత చట్టం ప్రకారం, రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ప్రతి రెండేళ్లకు ఒకసారి గరిష్ఠంగా 8 శాతం వరకు మాత్రమే ట్యూషన్ ఫీజు పెంచుకునే వెసలుబాటు ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఫీజులు పెంచాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే రాష్ట్రస్థాయి కమిషన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు
విద్యారంగ సమస్యలపై అధ్యయనం కోసం 2024 జూలైలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే పలుమార్లు (Telangana school fees) సమావేశమై ఫీజుల నియంత్రణపై చర్చించింది. అనంతరం తెలంగాణ విద్యా కమిషన్ను నియమించి, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల ఫీజులపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదికలో రెండేళ్లకు ఒకసారి 8 శాతం ఫీజు పెంపునకు అనుమతి ఇవ్వాలనే అంశాన్ని ప్రధానంగా ప్రతిపాదించారు.
అయితే ఈ నిర్ణయంపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం ప్రతి ఏడాది పెరుగుతుండగా, రెండేళ్లకు కేవలం 8 శాతం పెంపు సరిపోదని వారు వాదిస్తున్నారు. ఉపాధ్యాయుల వేతనాలు, భవన అద్దెలు, నిర్వహణ ఖర్చులు ఏటా పెరుగుతున్న నేపథ్యంలో ఫీజుల పెంపు పరిమితిని సడలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతుండగా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: