Save Secunderabad rally : సేవ్ సికింద్రాబాద్’ ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు శాంతియుతంగా నిర్వహించాలనుకున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు.
నగర అస్తిత్వం ప్రమాదంలో పడితే ప్రజలు నిరసన వ్యక్తం చేసే హక్కు లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు రెండు కళ్లు లాంటివని, అలాంటి నగరాల గుర్తింపును తొలగించాలన్న ఆలోచన సరైంది కాదని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుగ్లక్ పాలనను తలపిస్తోందని విమర్శించారు.
Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు
ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తూ అరెస్టులు (Save Secunderabad rally) చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. రిపబ్లిక్ డేకు పది రోజుల ముందు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని చేతబట్టి తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
సికింద్రాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తామని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: