ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ముఖ్య హామీ అమలు దిశగా ముందడుగు వేసింది. సూపర్ సిక్స్ పథకాలలో ప్రధానమైన ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ (‘Happy Food Giver – PM Kisan’) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లాంఛనంగా ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని వీరాయపాలెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య రైతులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,85,838 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి తొలి విడతగా రూ.7,000 చొప్పున నేరుగా జమ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం అందజేస్తారు. తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5,000 కాగా, కేంద్ర పీఎం కిసాన్ వాటా రూ.2,000గా ఉంది. ఈ విడత ద్వారా రైతులకు మొత్తం రూ.3,175 కోట్ల లబ్ధి చేకూరిందని సీఎం తెలిపారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,343 కోట్లు కేటాయించింది.

రైతుల కోసం ఆధునిక సాంకేతిక సహాయం
రైతులతో మాట్లాడుతూ చంద్రబాబు, దేశానికి అన్నం పెడుతున్న రైతుల మధ్య ఈ కార్యక్రమం ప్రారంభించడం నాకు గర్వంగా ఉంది. రైతుల కళ్లలో కనిపిస్తున్న ఆనందమే నాకు సంతోషం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా సంతృప్తిని ఇస్తోంది,” అన్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలని హామీ ఇచ్చారు. పంటల లాభనష్టాలపై ప్రత్యేక అధ్యయనం చేసి రైతులకు సరైన సూచనలు అందిస్తామని తెలిపారు.
ఇతర పథకాల ద్వారా రైతులకు అండ
రైతులకు డ్రిప్ ఇరిగేషన్ రాయితీలు పెంచినట్లు ఆయన తెలిపారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నామని గుర్తుచేశారు. అలాగే, మహిళల కోసం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. దీపం పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని తెలిపారు.
రైతుల కోసం ప్రత్యేక సహాయ వేదిక
పథకం అమలులో సందేహాలు ఉంటే నివృత్తి కోసం ప్రత్యేక పోర్టల్ మరియు టోల్ ఫ్రీ నెంబర్ (155251) ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. రైతులు ఈ పథకం ద్వారా లాభపడాలని, భవిష్యత్తులో మరిన్ని సహాయ కార్యక్రమాలు అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం రైతులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కీలక అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తుందని ప్రభుత్వం నమ్మకం వ్యక్తం చేసింది.
Read Also : జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత