దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల పెరుగుదల నేపథ్యంలో, వాటిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు ముందుకు వేసింది. జనవరి 2026 నుంచి దేశంలో తయారయ్యే అన్ని రకాల ద్విచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నిర్ణయం రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.ద్విచక్ర వాహనాలు భారత దేశంలో అత్యధికంగా ఉపయోగించే రవాణా సాధనాలు. అయితే ప్రమాదాల రేటులో కూడా వీటి వాటా గణనీయంగా ఉంది. అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ అయి, వాహనం అదుపుతప్పి పడిపోవడానికి దారి తీస్తుంది.ముఖ్యంగా తక్కువ పట్టు ఉన్న రోడ్లపై లేదా అత్యవసర పరిస్థితుల్లో ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది.
సురక్షితంగా బ్రేక్ వేయడానికి సహాయ పడుతుంది
ఈక్రమంలోనే ABS వ్యవస్థ ఈ సమస్యను నివారిస్తుందని అధికారులు గుర్తించారు. బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ కాకుండా ఇది నియంత్రిస్తుండగా, తద్వారా వాహనదారుడు జారిపోయే, క్రాష్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తూ సురక్షితంగా బ్రేక్ వేయడానికి సహాయ పడుతుంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ABS వ్యవస్థ ద్విచక్ర వాహన ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలదు. ఇది తక్కువ సమయంలో మరింత సమర్థవంతంగా బ్రేక్ వేయడానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా తడి రోడ్లపై, ఇసుక లేదా కంకర ఉన్న ఉపరితలాలపై లేదా అత్యవసర బ్రేకింగ్ సమయంలో అమూల్యమైన భద్రతను అందిస్తుంది. ఇప్పటికే 125సీసీ అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలకు ABS లేదా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) తప్పనిసరిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు అన్ని రకాల, అన్ని సామర్థ్యాల వాహనాలకు దీన్ని వర్తింపజేయాలని కేంద్రం నిర్ణయించింది.

ABS వ్యవస్థ
ఈ కొత్త నిబంధన వాహన తయారీదారులపై కొంత భారాన్ని మోపినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది రోడ్డు భద్రతకు ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వాహన తయారీదారులు జనవరి 2026 నాటికి తమ ఉత్పత్తి ప్రక్రియలను ABS వ్యవస్థతో అనుకూలంగా ఉండేలా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పు వల్ల టూ-వీలర్ల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అది అందించే భద్రతకు ఇది చాలా చిన్న ఖర్చు అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ద్విచక్ర వాహనం (Two-wheeler)కొనుగోలు చేసే సమయంలో వాహన తయారీదారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్డ్ సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా రెండు రక్షణ శిరస్త్రాణాలను సరఫరా చేస్తారని కేంద్రం తన ఆదేశాల్లో వెల్లడించింది.
Read Also: Gold Prise Update: బంగారం ధర రూ. 43 వేలకు పైగా తగ్గింది