బ్రహ్మోస్‌తో మహబూబ్‌నగర్‌కు రక్షణ రంగ గర్వకారణం?
మహబూబ్‌నగర్ జిల్లా రక్షణ రంగంలో చరిత్రాత్మక అడుగుల దిశగా సాగుతోంది. ప్రతిష్టాత్మకమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి సంస్థ బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణకు ఈ జిల్లాలో అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, బస్వాయిపల్లి గ్రామ శివారులు ఈ దృష్టిలో కేంద్రబిందువులుగా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో బ్రహ్మోస్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం బ్రహ్మోస్ సంస్థకు అన్ని విధాలా సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ భరోసాతో మూడు రోజుల వ్యవధిలోనే సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు.
ఈ స్థల పరిశీలనలో DRDL జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ డైరెక్టర్ డా. జైతీర్థ్ జోషి, డా. జీ.ఏ. శ్రీనివాస్ మూర్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీ.ఎ.ఎస్. సాంబశివప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి వారితో కలిసి భూముల పరిశీలనలో ఉన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యం కావడం, NH 44 మరియు NH 167 మధ్యలో ఉండడం వలన రవాణా, మౌలిక సదుపాయాల పరంగా అనుకూలత ఉంది. అధికారుల అభిప్రాయం ప్రకారం, బ్రహ్మోస్ తయారీ యూనిట్‌తోపాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఇదే సరైన స్థలమని అంచనా.

డిఫెన్స్ కారిడార్ కలలకు ప్రాణం పోసే ప్రాజెక్ట్
ఈ తాజా పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్ట్ మళ్లీ చర్చల కేంద్రంగా మారింది. బ్రహ్మోస్ యూనిట్ (Brahmos unit)ఏర్పాటు జరగడం ద్వారా కారిడార్ ప్రణాళికలకు పునరుత్సాహం లభించనుంది. యూనిట్ ఏర్పాటుతో MSME పరిశ్రమలకు పెద్ద ప్రోత్సాహం దక్కనుంది. మిస్సైల్ తయారీకి అవసరమైన విడిభాగాల ఉత్పత్తి కోసం అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఫలితంగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు అమితంగా పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రాంతీయ అభివృద్ధికి, యువతకు ఉద్యోగ అవకాశాలకు మార్గం చూపే దిశగా మారుతుంది.
బ్రహ్మోస్ – భారత బ్రహ్మాస్త్రం
బ్రహ్మోస్ మిస్సైల్ అనేది భారత్‌కు గర్వకారణమైన సాంకేతిక సాధనంగా నిలిచింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్(Supersonic cruise missile). శత్రు యాంటీ మిస్సైల్ వ్యవస్థల కంటికి చిక్కకుండా, తక్కువ ఎత్తులో దూసుకెళ్లగల ఈ క్షిపణి ధ్వని వేగానికి 2.8 రెట్లు అధికంగా ప్రయాణిస్తుంది. భారత్ వద్ద ప్రస్తుతం నాలుగు రకాల బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి. అవి ఉపరితలం నుండి ఉపరితలానికి, ఆకాశం నుండి ఉపరితలానికి, సముద్రం నుండి ఉపరితలానికి మరియు జలాంతర్గాముల నుండి ఉపరితలానికి ప్రయోగించగలవు. ఇవి భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన ఆయుధాలుగా నిలుస్తున్నాయి.
ఇప్పటికే హైదరాబాద్ బాలాపూర్‌లో బ్రహ్మోస్ తయారీ యూనిట్ ఉన్నా, అధిక ఉత్పత్తి అవసరాల దృష్ట్యా సంస్థ విస్తరణకు సిద్ధమైంది. ప్రత్యేకించి ఆపరేషన్ సింధూర్ వంటి యుద్ధ ప్రణాళికల అనంతరం భారత్ రక్షణ సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేయాలన్న కసితో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
భవిష్యత్తును మార్చే నిర్ణయాల్లో ఒకటి
బ్రహ్మోస్ సంస్థ విస్తరణ మహబూబ్‌నగర్ జిల్లాకు కేవలం ఒక పారిశ్రామిక ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది సైనిక, ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రాంతానికి కొత్త అధ్యాయాన్ని తీసుకురాబోతుంది. ఈ యూనిట్ స్థాపన జరిగితే, తెలంగాణ రక్షణ రంగ అభివృద్ధిలో కొత్త మైలురాయిని చేరనుంది. తెలంగాణలో మరిన్ని ప్రైవేట్, ప్రభుత్వ రక్షణ సంస్థల స్థాపనకు ఇది ఆదర్శంగా నిలుస్తుంది.
Read also: Jubilee Hills Constituency : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ నాదే – అజహరుద్దీన్