“ప్రభుత్వం తప్పిస్తే నేనే రంగంలోకి దిగుతా” హెచ్చరిక
చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకున్న అమానుష ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ (KA Paul) తీవ్రంగా స్పందించారు. ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తాను ప్రత్యేకంగా లేఖ రాసినట్లు తెలిపారు. తన లేఖకు వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చకు తీసుకురావాలని కోరారు. అయితే, ఈ ఘటనపై వెంటనే స్పందించినందుకు సీఎం చంద్రబాబును అభినందిస్తున్నానని తెలిపారు. కానీ స్పందన ఒక్కటే కాకుండా చర్యలూ ఉండాలన్నది తన అభిప్రాయమని వివరించారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలి
బాధిత మహిళపై జరిగిన దాడిని కేఏ పాల్ (KA Paul) తీవ్రంగా ఖండించారు. ఆమెను కొట్టిన వారిపై ఐపీసీ 302 సెక్షన్ కింద హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. “ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే శాశ్వత పరిష్కారాలు తీసుకోవాలి. అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలి” అని ఆయన పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.
అప్పులిచ్చి వేధించే వారిపై కఠిన చట్టం అవసరం
అప్పులిచ్చి వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల తరహాలో ఇక్కడ కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. “అప్పులిచ్చి మహిళలను కొట్టి, వారి ఆడపిల్లలను ఎత్తుకెళ్లి అప్పులు వసూలు చేసుకుంటున్నారు. ఇది ఎంత దారుణం? అలా వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారికి రూ. 5 లక్షల జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష విధించాలి. అటువంటి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబును కోరుతున్నాను” అని పాల్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శ
ఈ సందర్భంగా కేఏ పాల్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు, ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అమలు కాలేదని విమర్శించారు. “సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఏడవడం చూశాం, బయట కూడా చూశాం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ అమలుపరిచారు?” అని ఆయన నిలదీశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం మరో రూ. 5 లక్షల కోట్లు అప్పు చేసిందని, అయినా సూపర్ సిక్స్ అమలుపరిచామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా అవసరం
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని పాల్ అన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని.. రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. రైతులకు, మహిళలకు మంచి జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఒక లక్ష 50 వేల కోట్లు ఇస్తేనే సూపర్ సిక్స్ అమలు చేయగలమని అన్నారు. జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని.. రాష్ట్రంలో ప్రతిపక్షం తానేనని.. అందుకే ప్రజల గొంతుగా ప్రశ్నిస్తానని చెప్పారు.
Read also: Income: ఆదాయం వృద్ధి గణనీయంగా పెంచే దిశలో కీలక కార్యాచరణ