బెంగుళూరు (Bangalore)లో రాపిడో ‘జుగాడ్’: బైక్ టాక్సీలపై నిషేధం మధ్య వినూత్న మార్గం
భారతదేశం ‘జుగాడ్’లకు నిలయం. సమస్య వచ్చిన ప్రతిసారీ ప్రజలు కొత్తదనం, తెలివితేటలతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటారు. తాజాగా బెంగుళూరు (Bangalore)లో చోటు చేసుకున్న పరిణామం ఈ విషయానికి ప్రత్యక్ష ఉదాహరణ. కర్ణాటక హైకోర్టు బైక్ టాక్సీలను నిషేధించడంతో, యాప్ ఆధారిత రైడ్ అగ్రిగేటర్ రాపిడో ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. బైక్ టాక్సీ స్థానంలో “బైక్ పార్శిల్” పేరుతో ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తోంది. ప్రయాణికులే తమను తాము “పార్శిల్”గా బుక్ చేసుకుని రైడ్. ఇది ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న బెంగుళూరువాసులకు ఓ తాత్కాలిక ఉపశమనం లాంటిదిగా మారింది.

కోర్టు తీర్పు – ప్రభుత్వ నిర్ణయం
కర్ణాటకలో యాప్ ఆధారిత అగ్రిగేటర్లు నడుపుతున్న టూ-వీలర్ టాక్సీ సర్వీసుల కార్యకలాపాలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని కోర్టు తీర్పు చెప్పింది. గత శుక్రవారం (13న) ఉబర్, ఓలా, రాపిడో యాప్ సంస్థలు దాఖలు చేసిన స్టే అభ్యర్థనలను డివిజన్ బెంచ్ తిరస్కరించింది. మోటారు వాహనాల చట్టం కింద ‘బైక్ టాక్సీల’ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట నియమాలు, మార్గదర్శకాలను తెలియజేసే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
బైక్ టాక్సీ స్థానంలో ‘బైక్ పార్శిల్’: వినూత్న ప్రయత్నం
ఈ పరిణామాల నేపథ్యంలో రాపిడో తమ యాప్‌లో ‘బైక్’ సర్వీసును ‘బైక్ పార్శిల్’గా మార్చినట్టు తెలుస్తోంది. ప్రయాణికులు తమను తామే ‘పార్శిల్’గా బుక్ చేసుకుని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. “కర్ణాటకలో బైక్ టాక్సీ నిషేధం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. కానీ రాపిడో బైక్ యాప్ ప్రొడక్ట్ ఓనర్ ఇప్పటికే చట్టాన్ని ఉల్లంఘించారు. రైడ్ బుక్ చేసుకోలేకపోతున్నారా? ఫర్వాలేదు, మిమ్మల్ని మీరే పార్శిల్‌గా పంపించుకోండి. దీనిని ‘ప్యాస్ – ప్యాసింజర్ యాజ్ ఏ సర్వీస్’ అనొచ్చు” అంటూ ధన్వి అనే ఒక ఎక్స్ యూజర్ ‘బైక్ పార్శిల్’ బుకింగ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అముత భారతి అనే మరో ఎక్స్ యూజర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “కర్ణాటక హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీలను నేటి నుంచి నిషేధించింది. ఉబర్ ‘మోటో’ను ‘మోటో కొరియర్’గా, రాపిడో ‘బైక్’ను ‘బైక్ పార్శిల్’గా మార్చింది. తెలివైన ఎత్తుగడ” అని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వ, న్యాయ వ్యవస్థ వైఖరిపై విమర్శలు
ప్రతి రోజూ ట్రాఫిక్‌లో గంటల తరబడి సమయం వృథా చేస్తున్న బెంగుళూరువాసులకు బైక్ టాక్సీలు ఓ వరంలాంటివి. అయితే కోర్టు తీర్పు, ప్రభుత్వ వైఖరి వాటిని పూర్తిగా నిలిపివేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజా రవాణా సౌకర్యాలు పరిమితమైనప్పటికీ, ప్రభుత్వం కొత్త మార్గాలు అన్వేషించకపోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. నూతన మార్గదర్శకాలు రూపొందించేందుకు సుముఖత లేకపోవడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాపిడో చేసిన ఈ ‘జుగాడ్’ తాత్కాలిక ఉపశమనంగా మారినప్పటికీ, దీని చట్టబద్ధతపై ప్రశ్నలు మారుమూలలుగా వినిపిస్తున్నాయి.
Read also: Helicopter Crash: కేదార్‌నాథ్ యాత్రలో హెలికాప్టర్ల సేవల భద్రతపై అనుమానాలు