తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పని చేస్తున్న ఉద్యోగులు భక్తులకు నిరంతరం సేవలందిస్తూ సమర్పణ భావనతో పనిచేస్తున్నారని, వారి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని టీటీడీ కార్యనిర్వాహక అధికారి (ఈవో) జె. శ్యామలరావు(J. Shyamala Rao) స్పష్టం చేశారు. మంగళవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈవో మాట్లాడారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్దిష్ట సమయంలో పరిష్కరించడం ఎంతో అవసరమని అన్నారు. “అన్ని విభాగాల ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు మానవీయంగా సేవలందిస్తున్నారని, వారితో గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత మనపై ఉంది,” అని ఆయన పేర్కొన్నారు.

వివిధ శాఖల
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ, అలవెన్స్ చెల్లింపులు, పదోన్నతులు, డ్యూటీ షెడ్యూల్‌లు వంటి అంశాలను బాధ్యతగా చూడాలని అధికారులకు సూచించారు.నిబంధనల ప్రకారం పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. జీఎన్బీ, ఎస్వీ పూర్ హోమ్, కే.టీ, వినాయకనగర్, రామనగర్ ప్రాంతాలలోని టీటీడీ క్వార్టర్స్(TTD Quarters)లలో డ్రైనేజీ సమస్యలు, భవనాల లీకేజీలు, విద్యుత్ తదితర సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కేటాయించిన ఇళ్ల స్థలాలపై వివిధ శాఖల అనుమతులు విషయంలో సీనియర్ అధికారులతో కమిటీ వేసుకుని పరిష్కరించాలని సూచించారు. సదరు ప్రాంతాలలో రోడ్లు, కాలువలు, ఇతర ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాలపై టిటిడి ఉన్నతాధికారులు చర్చించాలన్నారు. దిగువ స్థాయిలో ఉద్యోగుల సమస్యలపై నిరంతరం సీనియర్ అధికారులు చర్చించి పరిష్కరించాలని, ప్రభుత్వ స్థాయిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని టీటీడీ అధికారులను ఈవో కోరారు.
Read Also: Jagan’s Visit to Podili : జగన్ కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లతో దాడి