దుల్కర్ సల్మాన్ ‘ఒరు యమండన్ ప్రేమకథ’పై ఒక సమీక్ష: ‘ఆహా’లో ‘ఒక యముడి ప్రేమకథ’గా స్ట్రీమింగ్
మలయాళంలో దుల్కర్ సల్మాన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. 2019లో నౌఫాల్ దర్శకత్వంలో ఆయన నుంచి వచ్చిన సినిమా పేరే ‘Oka yamudi Prema Katha’. ఈ సినిమా ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చింది. ‘ఒక యముడి ప్రేమకథ’ అనే టైటిల్‌తో ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథా నేపథ్యం, విశ్లేషణ, నటీనటుల పనితీరు, ముగింపు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కథా నేపథ్యం
Oka yamudi Prema Katha: లల్లూ (దుల్కర్ సల్మాన్) తండ్రికి తన కొడుకు బాగా చదువుకుని, డీసెంట్‌గా ఉండాలని కోరిక. అయితే లల్లూ అందుకు భిన్నంగా తయారవుతాడు. చిన్నప్పటి నుంచి మాస్ ఫ్రెండ్స్‌తో కలిసి తిరుగుతూ, తాగుతూ మాస్‌గానే తయారవుతాడు. తన స్నేహితులైన విక్కీ, ఢిల్లీ, కృష్ణమూర్తితో కలిసి తిరుగుతూ ఉంటాడు. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఒక టీమ్‌గా ఏర్పడి రంగులు వేసే పనితో రోజులు నెట్టుకొస్తూ ఉంటారు. లల్లూకి ఒక తమ్ముడు ఉంటాడు. అతను బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి పెళ్లి చేయాలంటే ముందుగా లల్లూ పెళ్లి చేసుకోవాలి. అందువల్ల ఆ విషయంలో పేరెంట్స్ అతనిని ఒత్తిడి చేస్తూ ఉంటారు. తనని చేసుకోమంటూ జెస్నా (సంయుక్తా మీనన్) లల్లూ వెంటపడుతూ ఉంటుంది. తాను పెళ్లాడవలసిన అమ్మాయి కనిపించినప్పుడు తనకి ఒక స్పార్క్ వస్తుందనీ, అప్పుడు ఆమెనే పెళ్లి చేసుకుంటానని లల్లూ మాటదాటేస్తూ ఉంటాడు.
ఒక రోజున ‘కనబడుట లేదు’ అనే ప్రకటన పేపర్లో వస్తుంది. ఆ యువతి పేరు దియా (నిఖిలా విమల్). ఆ యువతి ఫొటో చూసిన లల్లూ, తనకి స్పార్క్ వచ్చిందని ఫ్రెండ్స్‌తో చెబుతాడు. ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి తనకి సహకరించమనీ, తాను ఆమెనే పెళ్లి చేసుకుంటానని అంటాడు. ‘దియా’ ఎవరు? ఆమె ఎందుకు కనిపించకుండా పోయింది? ఆమె కోసం వెదకడం మొదలెట్టిన లల్లూకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ కథలో ప్రధానంగా ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు intertwined అయి ఉన్నాయి.
విశ్లేషణ
కథ ఏదైనా, ఆ కథతో చేసేది ప్రయత్నమైనా, ప్రయోగమైనా వినోద ప్రధానంగానే అది కొనసాగుతూ ఉండాలి. హీరో ఎంత సంఘసేవ చేస్తూ బిజీగా ఉన్నా, మధ్యలో ఓ చిన్న బ్రేక్ తీసుకుని వచ్చి హీరోయిన్‌తో కలిసి చిన్న రొమాంటిక్ టచ్ ఇచ్చి వెళుతూ ఉండాలి. అది పాటలో నైనా, సీన్లో నైనా. హీరో మాటల్లోనే తప్ప, తెరపై హీరోయిన్ కనిపించకపోతే ప్రేక్షకులకు చిరాకుపడిపోతారు. అలా చిరాకు పెట్టే సినిమానే ఇది.
హీరో తన తల్లిదండ్రులకు లేక లేక కలిగిన సంతానం. పురిటిలోనే పోయాడనుకున్నవాడు బ్రతుకుతాడు. మృత్యువును జయించినవాడు కావడం వలన ‘యముడు’ అని పేరు పెడతారు. మృత్యువును జయించినవాడికి యముడు అని పేరు పెట్టడం ఏంటో, ‘ఈ పేరు బాగుంది.. నాకు నచ్చింది’ అని తల్లి అనడం ఏంటో మనకి అర్థం కాదు. ఏదో తేడా కొడుతుందే అనే చిన్నపాటి అనుమానం మనలో మొదలవుతూనే ఉంటుంది.
కథ మొదలైన కాసేపటి వరకూ తెరపైకి హీరోయిన్ రాకపోతేనే అసహనానికి లోనయ్యే ఆడియన్స్, ఈ సినిమా చివరివరకూ ఆమె కోసం అలా వెయిట్ చేస్తూ కూర్చోవలసి వస్తుంది. క్లైమాక్స్‌కి ముందు హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. పోనీలే శుభం కార్డు పడిన తరువాతైనా కలిసి ఉంటారని సగటు ప్రేక్షకుడు ఆశపడతాడు. కానీ దర్శకుడు ఇక్కడ కూడా పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ఇక అప్పటివరకూ నవ్వించడం కోసం హీరో ఫ్రెండ్స్ నానా అవస్థలు పడతారు, మనలను నానా ఇబ్బందులు పెడతారు. ఈ క్రమం కొన్నిసార్లు ప్రేక్షకులను విసుగు తెప్పిస్తుంది.
పనితీరు
ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఫస్టు సీన్‌తోనే క్లారిటీ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించి హమ్మయ్య అనుకున్నాడు. ఆ తరువాత ఇంటర్వెల్‌కి ముందు ఒక బ్యాంగ్, క్లైమాక్స్ లోనూ ట్విస్ట్ ఉండేలా చూసుకున్నాడు. కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కథ బలపడటానికి కాకుండా, బలహీనపడటానికే ఉపయోగపడ్డాయని చెప్పుకోవలసి ఉంటుంది. దర్శకుడు కథను బలమైన విధంగా చూపించడంలో కొంత తడబడ్డాడనిపిస్తుంది.
ఆర్టిస్టులంతా మంచి అనుభవం ఉన్నవారే. కాకపోతే వారి పాత్రలలోనే బలం లేదు. దుల్కర్ సల్మాన్ తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, స్క్రిప్ట్ బలహీనత వల్ల అది పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సుకుమార్ ఫొటోగ్రఫీ, బిజిబల్ నేపథ్య సంగీతం, జాన్ కుట్టి ఎడిటింగ్ ఓ మోస్తరుగా అనిపిస్తాయి. వాళ్ల పనితీరును గురించి చెప్పుకునేంత గొప్పగా కథ లేదు. సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపించినా, కథనం బలంగా లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తుంది.
Read also: Vadakkan: ‘వడక్కన్’ (ఆహా) సినిమా రివ్యూ!