ఇంకెంతో సమయంలేదు మరో ఐదు రోజుల్లోనే స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తల్లిదండ్రులు తమ పిల్లలను ఏయే బడుల్లో చేర్పించాలని ఆలోచన చేస్తున్నారు. ఇదే తరుణంలో ప్రైవేట్ పాఠశాలల(Private schools) నిర్వాహకులు చిన్నారుల తల్లిదండ్రులను ఆకట్టుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు తమ బడుల్లోనే చేర్పించాలని ఒత్తిడి సైతం తీసుకొస్తున్నారు. ఆ హంగు ఆర్భాటాలను చూసి ఏం ఆలోచించకుండా హడావిడిగా పిల్లలను బడుల్లో చేర్పిస్తే చివరకు మీరే బాధపడతారు. ప్రస్తుతం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంతో పాటు పాఠశాలలు పునః ప్రారంభ సమయాన తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విద్యాశాఖ వెబ్సైట్
పాఠశాల నిబంధనల ప్రకారం ఏ స్కూల్ అయినా ప్రభుత్వ గుర్తింపు పొందడం తప్పనిసరి. ఇందుకు నిబంధనల ప్రకారం బడిలో అన్ని వసతులు కల్పించాలి. ఇక్కడ భవనం కూడా అదే తరహాలో ఉంటేనే ప్రభుత్వం గుర్తింపు సంఖ్యను కేటాయిస్తుంది. ఈ పత్రాన్ని ప్రదర్శించాలి. లేదంటే విద్యాశాఖ వెబ్సైట్(Education Department website)లోనూ గుర్తింపు పొందిన బడుల వివరాలను పొందుపరుస్తుంది. ఈ అంశాలను పరిశీలించాకే మీరు ఓ నిర్ణయానికి రావాలి.పాఠశాల ఆవరణ, తరగతి గదులు విశాలంగా ఉన్నాయా లేదో సరిచూసుకోవాలి. లేకుంటే అనుకొని సంఘటన (అగ్ని ప్రమాదం) జరిగితే మంటలు ఆర్పేందుకు అన్ని పరికరాలు ఉన్నాయా లేదా అన్న విషయంపై ఆరా తీయాలి. అగ్నిమాపక శాఖ నుంచి సైతం అనుమతి పొంది ఉండాలి.పాఠశాలల్లో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారినే ఉపాధ్యాయులుగా నియమించుకోవాలి. ఆయా అర్హతలు ఉన్నవారు ఉన్నారా? లేరా? అని ఆరా తీయడం మరువొద్దు. అన్నింటి కంటే ఇదే ప్రధానం.

ప్రభుత్వం సూచిస్తుంది
ఆటలు ఆడించేందుకు పీఈటీ సైతం ఉండాలి.విద్యార్థులను రోజులో కనీసం 45 నిమిషాలు ఆడించాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇందుకు మైదానం తప్పనిసరిగా ఉండాలి. ఆట వస్తువులు సైతం అందుబాటులో ఉండాలి.గతంలో పాఠశాల నిర్వహణ తీరును గమనించాలి. ఏమైనా లోపాలతో గొడవలు జరిగాయా, విద్యార్థులకు ఇబ్బంది కలిగేలా సిబ్బంది ప్రవర్తించారా అనే విషయమై ఆరా తీయాలి.ఫీజులు నిబంధనల ప్రకారం ఉన్నాయా అని తెలుసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు.మండల స్థాయి(Zone level)లో విద్యాశాఖ అధికారులను సంప్రదించి అనుమతులు, ఇతర విషయాలను తెలుసుకోవాలి.ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మకూడదు. స్వయంగా మీరే వెళ్లి ఆరా తీస్తేనే ఉత్తమంగా ఉంటుంది.
Read Also: Secunderabad: కొత్త జంట హనీమూన్ ప్రయాణం.. ప్రమాదంలో వరుడు మృతి