ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ లో పాకిస్తాన్ కు సాయం చేస్తున్న వారిపై కేంద్రం కన్నెర్ర చేస్తోంది. ఇన్నాళ్లూ చూసీ చూడనట్లు వదిలేసిన చాలా మందిని ట్రాక్ చేసి వారిని అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతోంది. ఇందులో మన దర్యాప్తు సంస్థలకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు తెలుస్తున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కు సాయం చేస్తున్న సోషల్ ఇన్ ఫ్లూయెన్సర్ల వరుస అరెస్టుల తర్వాత తేలిన లింక్ మేడమ్ ఎన్.
పాకిస్తాన్ లో వ్యాపారవేత్తగా ఉన్న నోషబా షెహజాద్ అనే మహిళ ఆ దేశ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) తరఫున పనిచేస్తూ భారత్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను ట్రాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న నోషబా ను మేడమ్ ఎన్ గా సంబోధిస్తున్నారు. ఆమె భారత్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను గుర్తించి వారిని సంప్రదించి పాకిస్తాన్ కు రప్పించి వారి నుంచి భారతీయ సమాచారం తెలుసుకుంటున్నట్లు గుర్తించారు. దర్యాప్తు సంస్థలు ఎంతోకాలంగా నిశ్శబ్దంగా ఉన్న నిందితులను ఇప్పుడు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.

జ్యోతి మల్హోత్రా వలలో పలువురు ఇన్ ఫ్లూయెన్సర్లు
ఈ మధ్య కాలంలో అరెస్టు అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లంతా ఈమె వలలో పడిన వారేనని తేలింది. లాహోర్ కేంద్రంగా జయానా ట్రావెల్స్ అండ్ టూరిజం పేరుతో ట్రావెల్స్ సంస్థ నడుపుతున్న ఈమె.. ఆ ముసుగులో భారత్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను భారీ మొత్తాలు ఆఫర్ చేసి తనవైపుకు తిప్పుకుంటున్నట్లు తేలింది. దీంతో వారు డబ్బుకు ఆశపడి దేశం దాటి వెళ్లి మరీ పాకిస్తాన్ వెళ్లి మన రహస్యాలు బయటపెడుతున్నట్లు తెలిసింది. భారత్ లో ఇలా 500 మంది స్లీపర్ షెల్స్ ను ఆమె నియమించినట్లు మన దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
3 వేల మంది పౌరుల్ని, 1500 మంది ఎన్నారైలను పాకిస్తాన్ కు రప్పించారు
పాకిస్తాన్ కు చెందిన ఓ రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ అధికారి భార్య అయిన ఆమె.. పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఐఎస్ఐ పంపుతున్న సూచనల ఆధారంగా భారత్ లో స్లీపర్ షెల్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని పాక్ ఆర్మీ, ఐఎస్ఐకి పరిచయం చేస్తుందని, ఆ తర్వాత వారు సమాచారం అందిస్తారని తెలుస్తోంది. ఇలా భారత్ కు చెందిన 3 వేల మంది పౌరుల్ని, 1500 మంది ఎన్నారైలను ఆమె పాకిస్తాన్ కు రప్పించినట్లు గుర్తించారు. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీని సైతం ఆమె వాడుకుంటున్నట్లు తేలింది. ఇందులో ముఖ్యంగా హిందువులు, సిక్కులే ఉన్నారు. వారిని పాకిస్తాన్ లో ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్ళన పేరుతో రప్పిస్తూ వారి నుంచి వివరాలు తీసుకుంటున్నట్లు తేలింది. ఆమెకు ఎంబసీకి మద్దతు ఉంది అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. దేశభద్రతను ప్రమాదంలో పడేసే ఇటువంటి కుట్రలపై భారత ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు తీవ్ర గమనంతో చర్యలు తీసుకుంటున్నాయి.
Read Also: Elon Musk: ఆ ఫైల్స్‌లో ట్రంప్ పేరు కూడా ఉంది..ఎలాన్ మస్క్ ఆరోపణలు