ఆమిర్ ఖాన్ ఎప్పుడూ తన కథల ఎంపికలో ప్రత్యేకతను చూపించే నటుడు.ఇటీవల కొంతకాలంగా తెరపై కనిపించని ఆమిర్ తాజాగా తన తదుపరి ప్రాజెక్టుల గురించి అధికారికంగా వెల్లడించారు.ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj)తో కలిసి ఓ భారీ సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఆమిర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ఈ నెల 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.కొంతకాలంగా ఆమిర్ ఖాన్ తదుపరి సినిమాల గురించి ఇండస్ట్రీలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా 2014లో సంచలన విజయం సాధించిన ‘పీకే’ సినిమాకు సీక్వెల్ రానుందని, అలాగే భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే(Dadasaheb Phalke) జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ కూడా చేయనున్నారని ప్రచారం జరిగింది. అయితే, ‘పీకే’ సీక్వెల్ వార్తలను ఆయన ఖండించారు. లోకేశ్ కనగరాజ్‌తో చేయబోయే సినిమా గురించి స్పష్టతనిస్తూ, “నేను, లోకేశ్ కలిసి ఓ సినిమా చేస్తున్నాం. అది సూపర్ హీరో జానర్‌కు చెందిన కథ. భారీ స్థాయిలో తెరకెక్కే యాక్షన్ సినిమా ఇది. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది” అని ఆమిర్ తెలిపారు.
కొత్త ప్రమాణాలను
ఈ భారీ బడ్జెట్ సినిమాతో ఆమిర్ ఖాన్ తొలిసారిగా సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నారు. తమిళంలో వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్న లోకేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం విశేషం. ఆమిర్ ఖాన్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుండటం, మరోవైపు లోకేశ్ మాస్ ఎంటర్‌టైనర్లకు పెట్టింది పేరు కావడంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు అమాంతం పెరిగాయి. భారతీయ సూపర్ హీరో సినిమాల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పేలా, భారీ యాక్షన్ హంగామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

అధికారిక ప్రకటన
ఇక, రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా చేయనున్నట్లు ఆమీర్ ఖాన్ ధృవీకరించారు. అయితే, ‘సితారే జమీన్ పర్’ విడుదల తర్వాత తన తక్షణ ప్రాధాన్యత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కే సూపర్ హీరో సినిమాకేనని ఆయన స్పష్టం చేశారు.ఆమిర్ ఖాన్(Aamir Khan) అధికారిక ప్రకటనతో అభిమానుల్లో, సినీ ప్రేమికుల్లో ఉత్సాహం నెలకొంది. భారతీయ సినిమాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ఈ సూపర్ హీరో సినిమా తారాగణం, కథాంశం, నిర్మాణ షెడ్యూల్ వంటి మరిన్ని వివరాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Rajendra Prasad: ఇకపై హుందాగా మాట్లాడతానన్న రాజేంద్రప్రసాద్