ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) పై విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు నిన్న నగరంలో ర్యాలీ నిర్వహించి చిన్న స్వామి స్టేడియంలో సంబరాలు చేసుకోవాలని భావించింది. అయితే విధి మరోలా తలచింది. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది అభిమానులు తన్నుకుని వచ్చి భారీ తొక్కిసలాట చోటు చేసుకోవడం, అందులో 11 మంది చనిపోవడం జరిగిపోయాయి. అయితే ఇంత దారుణ ఘటనకు ఓ ట్వీట్(Twitte) కారణమైనట్లు తెలుస్తోంది.

నిన్న బెంగళూరులో ర్యాలీకి సిద్దమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం దీన్ని అభిమానులకు తెలిపేందుకు ఎక్స్ లో ఓ ట్వీట్ చేసింది. నిన్న మధ్యాహ్నం 3:14 గంటలకు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఆర్సీబీ అధికారిక ఖాతా విధాన సౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన విక్టరీ పరేడ్ ను ధృవీకరిస్తూ ఓ ట్వీట్ చేసింది. ఆ తర్వాత స్టేడియం లోపల ఒక సన్మాన కార్యక్రమం ఉంటుందని ఇందులో తెలిపింది. ఈ పోస్ట్‌లో ఉచిత పాస్‌ల కోసం లింక్ కూడా ఉంది. పరిమిత ప్రవేశం అని ప్రకటిస్తూ, అభిమానులు పోలీసు మార్గదర్శకాలను పాటించాలని కోరింది.
ఉచిత ప్రవేశం పేరుతో తరలివచ్చేశారు
విక్టరీ పరేడ్ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు జరుగుతాయని, అభిమానులు అందరూ రోడ్‌షోను ప్రశాంతంగా ఆస్వాదించగలిగేలా పోలీసుల, ఇతర అధికారులు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని ఇందులో ఆర్సీబీ కోరింది. shop.royalchallengers.comలో ఉచిత పాస్‌లు (పరిమిత ప్రవేశం) అందుబాటులో ఉన్నాయంటూ ఈ పోస్టులో పెట్టింది. ఈ ట్వీట్ తో అభిమానులు భారీగా ఉచిత పాస్ లు తీసుకుని, ఉచిత ప్రవేశం పేరుతో తరలివచ్చేశారు. ఇదే చివరికి తొక్కిసలాటకు దారి తీసినట్లు తెలుస్తోంది.
ట్వీట్ ప్రభుత్వం విచారణ
ఈ ట్వీట్ పై ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరుపుతోంది. అలాగే ఈ సన్మాన వేడుకను ప్లాన్ చేసిన కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సభ్యుల్ని కూడా విచారించబోతున్నారు. జూన్ 4 కి ముందు ఆర్సీబీ నుండి వచ్చిన ఏకైక సమాచారం కర్నాటక క్రికెట్ సంఘం ద్వారా మాత్రమేనని తెలుస్తోంది. జూన్ 3న విధానసౌధలో సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి కోరుతూ వారు లేఖ పంపారు. అయితే పోలీసులు రెండు రోజులు వాయిదా వేసుకోవాలని కోరారు. కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ ఆర్సీబీ బృందాన్ని సత్కరించడానికి షెడ్యూల్ చేసిన విధానసౌధ బయట ఈవెంట్, మరొకటి చిన్నస్వామి స్టేడియంలో ఈవెంట్.. ఈ రెండు ఏకకాల ఈవెంట్లు గందరగోళాన్ని సృష్టించాయని సమాచారం.
Read Also: Banks: బ్యాంకింగ్ రంగంలో భారీగా లేఆప్స్