Justice Verma: మార్చి 14న భారత న్యాయవ్యవస్థలో సంచలనంగా మారిన ఘటన – జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదంపై అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైంది. ఈ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం, జస్టిస్ వర్మ (Justice Verma) ఇచ్చిన వివరణల్లో అనేక పునరాలోచనల విలువైన అంశాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఆయన నివాసంలోని స్టోర్‌రూమ్‌లో లభ్యమైన పెద్ద మొత్తంలో కాలిపోయిన కరెన్సీ నోట్ల అంశం ఇప్పుడు న్యాయవ్యవస్థను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం, ఈ నోట్ల గురించి జస్టిస్ వర్మ సరైన వివరణ ఇవ్వలేకపోవడం, పైగా తనపై కుట్ర జరుగుతోందని చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడం తీవ్ర అనుమానాలకు దారితీస్తున్నది.
స్టోర్‌రూమ్‌లో కాలిపోయిన కరెన్సీ నోట్లు – గాఢ రహస్యాల సంకేతమా?
తనపై కుట్ర జరుగుతోందంటూ జస్టిస్ వర్మ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
ప్రమాద సమయంలో తన ఇంటికి దుబాయ్ నుంచి వచ్చిన బంధువుల (Cousin sister, Her Husband) విషయాన్ని కూడా ఆయన తొలుత దాచిపెట్టడంపై కమిటీ సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. నివాస ప్రాంతంలో భద్రత తక్కువగా ఉందని, బయటి వ్యక్తులు వచ్చి ఆధారాలు పెట్టి ఉండొచ్చన్న వర్మ వాదనను కమిటీ పూర్తిగా తిరస్కరించింది.
ఇంటి వద్ద ఒక ఏఎస్ఐ, నలుగురు సిబ్బందితో కూడిన భద్రతా బృందం, గేటు వద్ద వ్యక్తిగత భద్రతా అధికారి (PSO), నమ్మకమైన సిబ్బంది నిరంతరం ఉంటారని, కాబట్టి బయటి వ్యక్తులు ప్రవేశించి ఆధారాలు పెట్టడం అసాధ్యమని కమిటీ స్పష్టం చేసినట్లు వర్గాలు తెలిపాయి.

ప్రమాదానికి అనంతరం నిర్లక్ష్యపు వైఖరి – కమిటీ అసంతృప్తి వ్యక్తం
అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని జస్టిస్ వర్మ అధికారికంగా తెలిపినప్పటికీ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి “దహనం” అనే పదాన్ని ఉపయోగించిన తర్వాతే ఆయన కూడా ఆ పదాన్ని వాడటం గమనార్హమని కమిటీ గుర్తించినట్లు సమాచారం.
మార్చి 15న భోపాల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా, ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి లేదా భద్రపరచడానికి జస్టిస్ వర్మ ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకోకపోవడంపై కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కాలిపోయిన కరెన్సీ తొలగింపు – సన్నిహితుల ప్రమేయం?
కమిటీ నివేదిక ప్రకారం, మార్చి 15 తెల్లవారుజామున, అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు వెళ్లిపోయిన అనంతరం, జస్టిస్ వర్మ వ్యక్తిగత కార్యదర్శి మరియు ఇంటి సిబ్బంది కలిసి స్టోర్‌రూమ్‌లో ఉన్న కాలిపోయిన కరెన్సీ నోట్లను తొలగించడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలున్నాయని వెల్లడించింది.
ఇది నేరపూరిత చర్యలకు సమానమైనదని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా, మార్చి 20న బదిలీ ఉత్తర్వులు వచ్చిన వెంటనే వర్మ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అంగీకరించడం ఇది కూడా కమిటీ దృష్టికి వెళ్లింది. ఇది అంతర్గత ఒత్తిళ్లు లేదా మరేదైనా ఒప్పందం జరిగిందనే సందేహాలను పెంచుతోంది.