కొలంబియా(Colombia)లో భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాల దౌత్యం ఫలించింది. పాకిస్థాన్(Pakistan) భూభాగంపై భారత్(India) దాడుల్లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనను కొలంబియా ఉపహంసరించుకుంది. కాంగ్రెస్ నేత శశిథరూర్ అందించిన ఆపరేషన్ సిందూర్ పూర్తి వివరాలను ఆ దేశం పరిగణలోకి తీసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన కొలంబియా విదేశాంగమంత్రి యెలాండ్ తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.
థరూర్ తో విదేశాంగ శాఖ ఉప మంత్రి రోసా యెలాండ్ విల్లావిసెన్సియో భేటీ
శశిథరూర్ నేతృత్వంలోని బృందం శుక్రవారం కొలంబియాకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి రోసా యెలాండ్ విల్లావిసెన్సియోతో థరూర్ భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన పూర్తి విషయాలను యెలాండ్ తెలియజేశారు. అనతంరం భారత్ జరిపిన దాడుల్లో పాకిస్థాన్‌లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు యెలాండ్ ప్రకటించారు. భారత బృందం తమకు అన్ని విషయాలు తెలియజేశాయని చెప్పారు. కశ్మీర్లో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకున్నామన్న యెలాండ్ దాడులకు దారితీసిన పరిస్థితిపై అవగాహన వచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం శశిథరూర్ కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై తమ వైఖరిని కొలంబియా పూర్తిగా తెలుసుకున్నారని థరూర్ తెలియజేశారు.
పక్క దేశాలపై ఉగ్రదాడులు
కొలంబియా పర్యటనకు వెళ్లిన శశిథరూర్ అంతకుముందు మీడియాతో మాట్లాడతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై అసహనం వ్యక్తం చేశారు. కేవలం మా ఆత్మ రక్షణ హక్కును మాత్రమే వినియోగించుకున్నామని తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత్ అనేక ఉగ్రదాడులను భరించిందని చెప్పారు. పాకిస్థాన్ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తోందని వివరించారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా థరూర్ నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్లింది.
Read Also: Trump: స్టీల్ దిగుమతులపై రెట్టింపు సుంకం: ట్రంప్ నిర్ణయం!