మైలవరం మండలంలో అమానుష ఘటనపై వైఎస్ జగన్ ఆగ్రహం
కడప జిల్లా మైలవరం మండలంలోని కంబాలదిన్నె గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న అమానుష ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ (YSR) కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ (YS) జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు మద్యం మత్తులో అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన దారుణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్, బాధిత చిన్నారి తల్లి కన్నీరు మున్నీరవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఎంతగానో బాధాకరమని అన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళా భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపాటు
ఈ ఘటన పట్ల వైఎస్ (YS) జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమని విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడటం, అక్రమ మద్యం అమ్మకాలను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా దొరకడం, మత్తులో దుర్మార్గులు మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతుండడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Govt) మొద్దు నిద్ర వీడట్లేదని ఆరోపించారు. కంబాలదిన్నె గ్రామంలో ఓ దుర్మార్గుడు మద్యం సేవించి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై హత్య చేశాడని ఆ బాలిక తల్లి కన్నీరుమున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. వైఎస్ఆర్సీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో దిశ యాప్, దిశ యాక్ట్, దిశ పోలీస్ స్టేషన్ల గురించి జగన్ ప్రస్తావించారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి
చిన్నారి కుటుంబం ప్రస్తుతం తీవ్ర మానసిక ఆవేదనలో ఉందని, వారి తల్లిదండ్రుల పరిస్థితి కన్నీళ్లు తెప్పించేదిగా ఉందని వైఎస్ జగన్ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికైనా నిందితుడిని వెంటనే అరెస్టు చేసి శీఘ్రంగా విచారణ పూర్తిచేసి అతనికి శిక్ష విధించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్థికంగా, మానసికంగా వారికి మద్దతుగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జగన్ ఈ ఘటనను ఖండిస్తూ, రాష్ట్రంలోని మద్యం విక్రయాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. “ఇలాంటి ఘోరాలు ఇక మళ్ళీ జరగకూడదు. ప్రతి చిన్నారి, ప్రతి మహిళ భయపడి జీవించే పరిస్థితి ఎప్పటికీ ఉండకూడదు” అని జగన్ పేర్కొన్నారు.
Sanjay: సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడగించిన కూటమి ప్రభుత్వం