నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా ‘అనగనగా ఒక రాజు’ పై క్లారిటీ.. విడుదల తేదీ ఫిక్స్!
టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి “జాతిరత్నాలు” సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆ సినిమా అంతకు ముందు నవీన్ కొద్దికొద్దిగా సినిమాల్లో కనిపించినా, జాతిరత్నాలతో ఆయన అసలైన నటనా సామర్థ్యం బయటపడింది. కామెడీ ప్రధానంగా నడిచిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించడమే కాకుండా, నవీన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేసింది. అదే టైమ్‌లో ఆయన నటన, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత అనుష్క శెట్టి సరసన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే సినిమాతో మరోసారి అలరించాడు. కానీ ఆ సినిమా తర్వాత చాలాకాలం వరకు నవీన్ నుంచి ఎలాంటి సినిమా అప్డేట్ రాలేదు. దాంతో ఆయన సినిమాలపై రకరకాల రూమర్స్ వచ్చాయి. కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేశాడని, విదేశాల్లో సెటిలైపోతున్నాడని వంటి ఊహాగానాలు మొదలయ్యాయి.

రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేలా ‘అనగనగా ఒక రాజు’ టీమ్ అప్డేట్
ఇలాంటి సమయంలోనే “అనగనగా ఒక రాజు” అనే కొత్త సినిమాను నవీన్ పోలిశెట్టి ప్రకటించాడు. ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. గతంలో ఓ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ప్రీ వెడ్డింగ్ వీడియో అంటూ విడుదల చేసిన ఈ వీడియో నిడివి కేవలం మూడు నిమిషాల 2 సెకన్లు మాత్రమే ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమా అసలు వస్తుందా రాదా అనే డౌట్ మొదలైంది .
సంక్రాంతి రిలీజ్‌కి రెడీగా నవీన్ – బాక్సాఫీస్ వార్ ఖాయం!
ఈ వీడియోతో పాటు మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది చిత్రబృందం. “అనగనగా ఒక రాజు” సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌కి నవీన్ వినూత్నమైన పోస్టర్‌ని ఎంచుకున్నాడు. అందులో ఆయన లుంగీ – బనియన్‌లో బైక్ మీద వేపపుల్లను నోట్లో పెట్టుకుని వస్తున్న స్టైల్ చూస్తే ఆయన మార్క్ హ్యూమర్ మళ్ళీ రిపీట్ కానుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా కూడా రిలీజ్ అవుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద రియల్ వార్ జరగనుంది. అయినా, నవీన్ సినిమాలకు యూత్‌లో ఉండే క్రేజ్‌కి బాగా డిఫరెంట్ ఫ్యాన్‌బేస్ ఉంది. చిన్న బడ్జెట్‌తో సక్సెస్‌ఫుల్ సినిమాలు ఇచ్చిన నవీన్.. ఈసారి కూడా తన స్టైల్‌లో ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తున్నాడు.
నవీన్ మార్క్ కామెడీ మళ్లీ వర్కౌట్ అవుతుందా?
నవీన్ పోలిశెట్టి సినిమాల్లో కామెడీ టైమింగ్, నేచురల్ యాక్టింగ్‌కి ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడి సినిమాల్లోని పాత్రలు మామూలు జీవితానికి దగ్గరగా ఉండటం, వాటిలోని హాస్యం గుండెకు హత్తుకునేలా ఉండటం వల్ల ప్రేక్షకులకు మంచి కనెక్ట్ ఏర్పడుతుంది. ఇప్పుడు “అనగనగా ఒక రాజు” కూడా అటువంటి ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్‌గా వస్తున్నట్టు అర్థమవుతుంది. మ్యూజిక్, టెక్నికల్ వర్క్, న్యాచురల్ స్టోరీటెల్లింగ్ మీద చిత్రయూనిట్ పూర్తి నమ్మకంతో ఉంది. మరి సంక్రాంతి బరిలో బిగ్ హీరోల సినిమాల మధ్య నవీన్ సినిమా ఎలా నిలుస్తుందో చూడాలి. కానీ నవీన్ స్టైల్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను చూస్తే, మినిమమ్ గ్యారంటీ హిట్ అనిపించుకుంటోంది.