ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్లతో చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రికీ పాంటింగ్(Ricky Ponting) పంజాబ్ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. శ్రేయస్ అయ్యర్‌తో పాటు తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రేయస్ అయ్యర్ సత్తా ఏంటో తనకు తెలిసే వేలంలో భారీగా ఖర్చు పెట్టినట్లు స్పష్టం చేశాడు.పంజాబ్ కింగ్స్ జైత్ర యాత్ర క్రెడిట్ తనది కాదని, అయ్యర్దేనని తెలిపాడు.’పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్-1కు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి విజయాలు సాధించాలంటే చాలా కృషి చేయాలి. వేలం నుంచే కార్యచరణను మొదలు పెట్టాలి. అయితే నాకు ఇది పెద్ద సవాల్‌గా మారింది. కొత్త ఫ్రాంచైజీకి రావడంతో వెంటనే మార్పు తీసుకురావాల్సి వచ్చింది. ఇదో నాణ్యమైన జట్టు. అయితే మా లక్ష్యాన్ని మేం అందుకోలేదు. ఇదే విషయాన్ని నేను మా ఆటగాళ్లకు పదే పదే గుర్తు చేస్తాను. మనం ఆడాల్సిన పెద్ద మ్యాచ్‌లు ఇంకా ఉన్నాయని చెబుతాను. 24 ఏళ్ల వయసులో ప్రభ్సిమ్రాన్ సింగ్ 500 పరుగులు చేశాడు. ఈ టోర్నీ ద్వారా లభించిన ఆణిముత్యం ప్రియాన్ష్ ఆర్య అని ఆరంభంలోనే చెప్పాను.
అద్బుతంగా
ఫియర్లెస్ గేమ్‌తో కుర్రాళ్లు సత్తా చాటుతున్నారు. జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్ వంటి విదేశీ ఆటగాళ్లు రాణిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. మాది ఒక సంతోషకరమైన టీమ్. ఈ పదివారాలు సంతోషంగా గడిపాం. మరో వారం మిగిలి ఉంది. వేలంలో నేను ఖర్చు పెట్టిన తీరును చూస్తేనే శ్రేయస్ అయ్యర్‌తో పనిచేసేందుకు నేను ఎంత ఆసక్తిగా ఉన్నాననే విషయం అర్థమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు ప్రాతినిధ్యం వహించినప్పుడే మా మధ్య మంచి సంబంధం నెలకొంది. చాలా రోజులుగా శ్రేయస్ అయ్యర్ తెలుసు. అతనో ప్రతిభ కలిగిన ఆటగాడు. జట్టులో కొత్త సంస్కృతిని నెలకొల్పాలంటే అయ్యర్ వంటి ఆటగాళ్లు అవసరం. అర్ష్‌దీప్ సింగ్ అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. యుజ్వేంద్ర చాహల్ ఫిట్ అవ్వాల్సిన అవసరం ఉంది.

విశ్రాంతి
మీరు మా ఆటగాళ్లందరితో వ్యక్తిగతంగా మాట్లాడితే వారంతా శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తారు. అతని అద్భుతమైన సారథ్యంతోనే పంజాబ్ సక్సెస్ అయ్యింది. ఈ విజయాన్ని మేం సెలెబ్రేట్ చేసుకుంటాం. గత మ్యాచ్ మినహా ప్రతీ మ్యాచ్ రాత్రి మేం పార్టీ చేసుకున్నాం. గత మ్యాచ్ తర్వాత సమయం లేకపోవడంతో పార్టీ చేసుకోలేదు. కానీ రేపు మధ్యాహ్నం మాకు విమానం ఉంది. కాబట్టి ఈ విజయాన్ని ఆస్వాదిస్తాం. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇచ్చి ఆ తర్వాత ట్రైనింగ్‌పై ఫోకస్ పెడుతాం. మార్కో జాన్సెన్(Marco Janssen) అసాధారణ బౌలర్. అతని స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. మార్కో వెళ్లే ముందు జెమిసన్ ఓ మ్యాచ్ ఆడాలని తీసుకొచ్చాం. మాకు మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది. మార్కో లేని లోటును భర్తీ చేస్తామని భావిస్తున్నా.’అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
Read Also : Pbks vs Mi: ముంబైపై పంజాబ్ గెలుపు