మహానాడులో పసందైన విందు భోజనం – తెదేపా సంప్రదాయానికి మరోసారి సాక్ష్యం!
తెలుగుదేశం పార్టీ మహానాడు ఎక్కడ జరిగినా, అక్కడ పసందైన విందు భోజనాలకే ప్రాధాన్యం ఉంటుంది. ఈ సంస్కృతి పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత నందమూరి తారకరామారావు గారి కాలం నుంచి కొనసాగుతోంది. ఆయన భోజనప్రియుడు కావడంతో ఆయన అభిరుచులకు అనుగుణంగానే, ప్రతి మహానాడులోనూ రుచికరమైన, ప్రత్యేకమైన వంటకాలను ప్రతినిధులకు, అతిథులకు అందించడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం కడప జిల్లాలో మూడు రోజులపాటు జరుగుతున్న మహానాడు వేడుకల్లోనూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. విందు ఏర్పాట్లు అద్వితీయంగా ఉండటమే కాకుండా, ఈసారి మాంసాహార వంటకాలను కూడా జోడించడం విశేషం. చాలాకాలంగా మహానాడులో మాంసాహారానికి చోటు లేకపోవడం, ఈసారి మాత్రం రాయలసీమ వాసుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక మెనూ రూపొందించడం విశేషంగా నిలిచింది.

రోజుకు 30 రకాల వంటకాలు – సంప్రదాయం, ఆధునికతకు సమపాళ్ళు
మహానాడు ఏ ప్రాంతంలో జరిగినా అక్కడి ప్రాంతీయ ప్రత్యేకతలను ప్రతిబింబించేలా భోజన ఏర్పాట్లు ఉండేలా చూసుకుంటారు. ఈసారి కడప మహానాడులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది ప్రతినిధుల కోసం వంటకాల ఎంపిక ఎంతో ప్రత్యేకంగా రూపొందించారు. ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డు వంటి ప్రసిద్ధ స్వీట్లు మెనూలో చోటు దక్కించుకోగా, పప్పు, దప్పళం, ఉలవచారు, పాల తాలికలు, చక్కెర పొంగలి వంటి తెలుగువారి ఇష్టమైన పిండివంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆధునిక రుచులుగా ఆపిల్ హల్వా, వెజ్ జైపూరి, కడాయి వెజ్ కుర్మా వంటివి కూడా వడ్డించబడ్డాయి. ప్రతి రోజూ దాదాపు 30 రకాల భోజనాలను అతిథులకు అందిస్తూ, భోజనానుభూతిని ఒక పెద్ద పండుగలా మార్చేశారు.
మాంసాహార రుచులు – రాయలసీమ తరహాలో
ఈ సందర్భంగా భోజన ఏర్పాట్ల కమిటీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ “2014 నుంచి మహానాడుకు మనమే భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సంవత్సరం కడప మహానాడుకు 10 రోజుల ముందే 2000 మంది వర్కర్లతో వచ్చి, కమిటీ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్లు, భోజనాలు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ రెండు రోజుల్లో తాపేశ్వరం కాజాలు, అల్లూరయ్య మైసూరుపాకులు, చక్కెర పొంగలి, హల్వా వంటి స్వీట్లతో పాటు రాయలసీమ వాసుల కోసం నాన్ వెజిటేరియన్ విభాగంలో గోంగూర చికెన్ బిర్యానీ, దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీలు, రోజూ ఎగ్ ఫ్రై వంటివి అందిస్తున్నాం. వెజిటేరియన్ వంటకాలను కూడా రుచిగా అందిస్తూ ఈ మూడు రోజుల మహానాడును విజయవంతం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం” అని తెలిపారు.
పాల తాలికలు, బొబ్బట్లు – ఎన్టీఆర్ జయంతికి ప్రత్యేక వంటకాలు
మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఇష్టమైన వంటకాలు ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నారు. పాల తాలికలు, బాదం బర్ఫీ, బొబ్బట్లు, చక్కెర పొంగలి వంటి వంటకాలు ఆ రోజు ప్రత్యేకంగా వడ్డించనున్నారు. ఈ కార్యక్రమం నేతలు, కార్యకర్తల్లో ఎన్టీఆర్ పట్ల గల గౌరవాన్ని, అభిమానాన్ని సూచిస్తుంది. ఇలా విందు ద్వారా నేతల స్మృతిని నిలుపుకోవడం కూడా తెదేపా ప్రత్యేకత.
భారీ ఏర్పాట్లు – వేలాదిమందికి విందు
భోజనాల కోసం ప్రత్యేకంగా ఐదు భారీ హ్యాంగర్లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండు హ్యాంగర్లను పూర్తిగా నాయకులు, కార్యకర్తల కోసం కేటాయించారు. ఒక్కో షెడ్లో ఒకేసారి 3500 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. మరో హ్యాంగర్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలకు, ఇంకో హ్యాంగర్లో కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, జీవితకాల సభ్యత్వం తీసుకున్న వారికి భోజన సదుపాయం కల్పించారు. ప్రతిరోజూ సుమారు 30,000 మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేయగా, అవసరమైతే అప్పటికప్పుడు మరో 10,000 మందికి వడ్డించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.
మహానాడు చివరి రోజు జరిగే భారీ బహిరంగ సభ సందర్భంగా దాదాపు 3 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం కడప-చిత్తూరు మార్గంలో 75,000 మందికి, పులివెందుల మార్గంలో 35,000 మందికి, రాజంపేట నుంచి వచ్చే మార్గంలో 30,000 మందికి, నంద్యాల మార్గంలో 50,000 మందికి భోజన ఏర్పాట్లు చేశారు.
Anantapuram: మైనర్ బాలికను పెళ్లాడిన వృద్ధుడు.. పోలీస్ అధికారులకు పిర్యాధు