భారత్, తైవాన్(Bharath, Taiwan)లతో తరచూ కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా(China).. తన సైనిక ఆధునీకరణను వేగంగా పెంచుతోందని అమెరికా రక్షణ గూఢచార(America Defence) సంస్థ నివేదిక వెల్లడించింది. ఇందులో భాగంగానే 2030 నాటికి కనీసం 1000 అణ్వాయుధాలను కలిగి ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం భారత్.. చైనా(Bharath, China)ను ప్రాథమిక ప్రత్యర్థిగా చూస్తోందని వివరించింది. అయితే చైనాకు దీటుగా.. భారత్ కూడా బలోపేతం కావడంపై దృష్టి పెట్టింది. చైనాను ఎదుర్కోవడానికి, తన సొంత సైనిక శక్తిని పెంచుకోవడానికి భారత్ తన రక్షణ ప్రాధాన్యతలపై దృష్టి సారించిందని ఆ నివేదిక పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ ప్రాధాన్యతలు ప్రపంచ నాయకత్వాన్ని చాటడం.. చైనాను ఎదుర్కొవడం, భారత సైనిక శక్తిని పెంచుకోవడంపై దృష్టి సారించాయని తెలిపింది. అదే సమయంలో పాకిస్తాన్‌ను అనుబంధ భద్రతా సమస్యగా భారత్ పరిగణిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

తైవాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలపై ఒత్తిడి
తైవాన్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి చైనా తన సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేస్తోందని.. అమెరికా నివేదిక తెలిపింది. తైవాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలపై అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువచ్చేందుకు చైనా ముమ్మరంగా పనిచేస్తోందని నివేదిక పేర్కొంది. భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లడఖ్ వాస్తవాధీన రేఖ వెంబడి గత ఏడాది బలగాల ఉపసంహరణ ప్రక్రియ జరిగింది. అయితే ఇది సరిహద్దు వివాదాన్ని పూర్తిగా పరిష్కరించలేదని.. కానీ 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల ఉద్రిక్తతలను మాత్రమే తగ్గించిందని నివేదిక పేర్కొంది.
తైవాన్‌పై సైనికచర్య
చైనా అణు వార్‌హెడ్ల నిల్వ 600కి పైగా పెరిగిందని.. ఇది 2030 నాటికి 1000కి పైగా అణ్వాయుధాలు ఉంటాయని అమెరికా నివేదిక అంచనా వేసింది. తక్కువ దిగుబడి, కచ్చితమైన స్ట్రైక్ క్షిపణులు, మల్టీ మెగాటన్ దిగుబడులతో కూడిన ఖండాంతర బాలిసిస్ట్ క్షిపణులతో పాటు మరింత వైవిధ్యమైన అణు శక్తిని సాధించడమే చైనా సైన్యం లక్ష్యమని నివేదిక వివరించింది. అదే సమయంలో తైవాన్‌పై సైనికచర్య చేపట్టి.. బలవంతంగా చైనాలో కలిపేసుకోవడం.. దానికి స్వాతంత్య్రం ఇవ్వకుండా అడ్డుకోవడం, తైవాన్ రక్షణ పట్ల అమెరికా నిబద్ధతను పరీక్షించడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి.. తైవాన్‌పై దౌత్య, సమాచార, సైనిక, ఆర్థిక ఒత్తిడి ప్రచారాలను కొనసాగించే అవకాశం ఉందని అమెరికా నివేదిక తేల్చి చెప్పింది.
Read Also: Akashtir: ఆకాశ్‌తీర్ వాయు రక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?