రంగస్థల దిగ్గజం జీవీ బాబు కన్నుమూత – తెలుగు నాటకరంగానికీ, చిత్రపరిశ్రమకీ తీరని లోటు
తెలుగు నాటకరంగంలో తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతుడు, ‘బలగం’ సినిమాతో ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు జీవీ బాబు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, వరంగల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. రంగస్థల కళాకారుడిగా ఎన్నో దశాబ్దాలుగా కళాజీవిగా జీవించిన జీవీ బాబు, సినీ ప్రేక్షకులకు మాత్రం ‘బలగం’ చిత్రంతో పరిచయం అయ్యారు. ఆయన మృతి వార్తతో కళాజగత్తు శోకసంద్రంలో మునిగిపోయింది.
‘బలగం’ దర్శకుడు వేణు స్పందన – జీవితాంతం నాటకరంగమే ఆయన గమ్యం
జీవీ బాబు మృతి పట్ల ‘బలగం’ సినిమా మూవీ డైరెక్టర్ వేణు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. జీవీ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. “జీవీ బాబు గారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోకే గడిపారు. చివరి రోజుల్లో ఆయనను బలగం మూవీతో వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ పోస్ట్ చేశారు. జీవీ బాబు మృతి పై సినీప్రముఖులు, బలగం మూవీ నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.
బలగంలో ‘అంజన్న’గా జీవి బాబు – సహజ నటనకు జీనియస్
కాగా, రెండేళ్ల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో భాగమైన నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. చాలా మందికి మంచి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కాగా, ఇదే బలగం సినిమాలో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా అద్భతంగా నటించారు జీవీ బాబు. కథని ముందుకు తీసుకోవడంలో ఆయనదే కీలక పాత్ర. మన పల్లెటూర్లలో తాతలు ఎలా ఉంటారో అచ్చం అలాగే ఎంతో సహజంగా నటించి జీవీ బాబు మెప్పించారు. అలాంటి నటుడు మృతిచెందడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
సినీ, నాటక రంగ ప్రముఖుల శోక స్పందన
జీవీ బాబు మరణ వార్త తెలిసిన వెంటనే నాటకరంగానికి చెందిన పలువురు కళాకారులు, దర్శకులు, రచయితలు ఆయన పట్ల గాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రంగానికీ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. రూటు నటనకు ప్రతిరూపంగా నిలిచిన బాబును కోల్పోవడం పట్ల వాళ్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Preity Zinta: దేశభక్తిని చాటిన బాలీవుడ్ బ్యూటీ –సైన్యం కోసం ప్రీతి జింటా భారీ విరాళం