అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ(Washington DC)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్(Israel)కు చెందిన ఇద్దరు దౌత్య కార్యాలయ సిబ్బందిని ఓ దుండగుడు కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో “ఫ్రీ పాలస్తీనా”(Free Palastina) అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఈ దారుణ హత్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(Jaishankar) తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది కాల్పులు
వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ యూదు మ్యూజియం సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మ్యూజియంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది (ఒక పురుషుడు, ఒక మహిళ)పై నిందితుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడిని చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్‌గా గుర్తించారు.

సహోద్యోగులకు మా ప్రగాఢ సానుభూతి
ఈ హత్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర పదజాలంతో ఖండించారు. “వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తల హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు, సహోద్యోగులకు మా ప్రగాఢ సానుభూతి. దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలి” అని జైశంకర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. జైశంకర్ పోస్టుకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సేర్ స్పందిస్తూ, “ధన్యవాదాలు, ప్రియ మిత్రమా!” అని బదులిచ్చారు.
ట్రంప్ ఆగ్రహం, దర్యాప్తు
ఈ దారుణ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ద్వేషానికి, రాడికలిజానికి అమెరికాలో స్థానం లేదు. ఈ హత్యలు యూదు వ్యతిరేకతతో జరిగినవే. ఇలాంటి భయంకరమైన ఘటనలు తక్షణమే ఆగాలి” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. అధికారులు ఈ ఘటన వెనుక ఉన్న ఉద్దేశ్యం, ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇజ్రాయెల్ కూడా తమ దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.
Read Also: Jaishankar: ట్రంప్ మాటలు పట్టించుకోబోమని జైశంకర్ వివరణ