ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకం ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తిరుపతి దర్శనానికి వెళ్లిన వారు కచ్చితంగా కాణిపాకం కూడా వెళ్లి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకుంటారు. ఇక గణపతి ఉత్సవాల సమయంలో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో కాణిపాకం వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో కాణిపాకం ఆలయ అధికారులు కీలక అలర్జ్ జారీ చేశారు. ఆలయంలో వీఐపీ దర్శన టికెట్(VIP darshan ticket) ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది.

వివరాలు
దర్శనానికి సంబంధించి వీఐపీ టికెట్ ధరను రూ.300గా నిర్ణయించారు అధికారులు. దీన్ని అమలు చేయడం కోసం కమిషనర్ అనుమతి పొందేందుకు సిద్ధమయ్యారు. స్వామివారి ఆలయంలో ప్రస్తుతం సర్వదర్శనం, రూ.100, రూ.150 టికెట్లపై భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. సిఫార్సులపై వచ్చే భక్తులకు ఆలయ ఉత్తర భాగంలోని వీఐపీ ద్వారం వద్ద రూ.150 టికెట్ ఇస్తున్నారు.ఈక్రమంలో ఇకపై వీఐపీ ద్వారం గుండా దర్శనానికి వెళ్లే భక్తులకు టికెట్ ధర రూ.300గా ప్రతిపాదించారు. కమిషనర్ అనుమతి తీసుకుని 15 రోజుల్లో అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కాణిపాకం ఆలయానికి వచ్చే ప్రొటోకాల్, ఉభయదారులు, వారి కుటుంబ సభ్యులు మినహా సిఫార్సులపై వచ్చే ప్రతి ఒక్క భక్తుడు తప్పనిసరిగా టికెట్లు తీసుకోవాలని ఆలయ ఈవో పెంచల కిషోర్ కోరారు. రికమెండేషన్(Recommendation)లపై వచ్చే భక్తులు కొందరు స్వామివారి దర్శనానికి ఉచితంగా వెళ్తున్నారని తెలిపారు. అంతేకాక ఆలయ ఉద్యోగులు కూడా వారికి కావాల్సిన వారు వస్తే తప్పకుండా టికెట్లు కొనుగోలు చేసి దర్శనానికి తీసుకెళ్లాలి అని సూచించారు. శనివారం నుంచే ఈ విధానం అమలు చేస్తామని తెలిపారు.ఇదిలా ప్రస్తుత వేసవి సెలవుల నేపథ్యంలో కాణిపాకం ఆలయంలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అందుకు తగిన విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Rea Also:Murali Nayak: మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగానూ సాయం ప్రకటించిన పవన్