ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు – పెహల్గాం దాడిపై ప్రతీకారం
కాశ్మీర్ పెహల్గాం పై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిపై భారత్ సంధించిన ప్రతీకారం, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన దాడిలో సుమారుగా 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఆయన వెల్లడించారు. పెహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టిగా బదిలిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ఆపరేషన్ గురించి వివరించేందుకు అఖిల పక్ష సమావేశం నిర్వహించింది.
అఖిల పక్ష సమావేశం వివరాలు
పార్లమెంట్ లోని లైబ్రరీ భవనంలో జరిగిన అఖిల పక్ష బేటికి పలువురు నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజకీయ పార్టీలకు వివరించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ తో పాటు అమిత్ షా, ఎస్ జయశంకర్, జేపి నడ్డ, నిర్మల సీతారామన్లు హాజరయ్యారు. విపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాధ్యాయ్, టిఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందేశం
ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత్ పై పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా కయ్యానికి దిగిందని, దానికి తప్పనిసరిగా ప్రతీకారం ఇవ్వడం జరుగుతుందని హెచ్చరించారు. గతంలో కూడా ఒకసారి సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. తమ సైనిక బలగాలు కేవలం ఉగ్రవాదులను వారి స్థావరాలను మాత్రమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయని అన్నారు. ఇంతటితో తాము వదిలేది లేదని పాకిస్తాన్ మెడలు వంచి తీరుతామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
ప్రభుత్వ ఉద్దేశాలు, ప్రతిపక్షాల మద్దతు
సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ వివరాలు, ప్రభుత్వ ఉద్దేశాలను రక్షణ శాఖ మంత్రి ప్రతిపక్ష నేతలకు వివరించారని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు అత్యంత పరిణతితో వ్యవహరించాయని, ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయని అన్నారు. ఈ అంశంలో రాజకీయాలకు తావు లేదని, ఈ పోరాటం భారత ప్రజలందరికని రిజిజు వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ కు ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి అండగా ఉంటామని, దేశం కోసం కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.