హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేస్తే జట్టులో కొనసాగుతారని స్పష్టం చేశాడు. వారి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందన్నాడు. వారి ఆటతీరు బాగుంటే జట్టులో కొనసాగుతారని, లేకుంటే సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారని గంభీర్ తెలిపాడు. ఏబీపీ ఇండియా 2047 సమ్మిట్‌లో పాల్గొన్న గంభీర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టీమిండియా ఎవరి జాగీరు కాదని, కొందరు కామెంటేటర్లు భారత క్రికెట్‌ను తమ వ్యక్తిగత ఆస్తిగా భావిస్తున్నారని మండిపడ్డాడు.’ఓ క్రికెటర్ ఎప్పుడు వీడ్కోలు పలకాలనేది అతని వ్యక్తిగత నిర్ణయం. కోచ్, సెలెక్టర్, బీసీసీఐ ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలో చెప్పరు. మెరుగైన ప్రదర్శన చేస్తే 40-45 ఏళ్ల వయసు వరకు ఆడవచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా మెరుగైన ప్రదర్శన చేస్తే 2027 వన్డే ప్రపంచకప్‌కు ఎంపికవుతారు. విరాట్, రోహిత్‌ల భవిష్యత్తు వారి ప్రదర్శనపై ఆధారపడి ఉంది. వారి ఆటతీరు బాగుంటే జట్టులో కొనసాగుతారు. లేదంటే సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. క్రీడాకారులు ఎప్పుడూ ఘన వీడ్కోలు గురించి ఆలోచించరు. వీడ్కోలు కంటే దేశ ప్రజల అభిమానం అతిపెద్ద బహుమతి.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ప్రాతినిధ్యం
విరాట్ కోహ్లీతో గొడవలు మైదానానికే పరిమితమని, వ్యక్తిగతంగా అతనితో ఎలాంటి విభేదాలు లేవని గంభీర్ స్పష్టం చేశాడు. ‘మేమిద్దరం ఢిల్లీ కుర్రాళ్లం. మైదానంలో రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పుడు,మా జట్ల కోసం పోరాడే హక్కు మాకు ఉంది. ఆఫ్‌ద ఫీల్డ్‌లో మా మధ్య ఉన్న సంబంధం అందరికి తెలియాల్సిన అవసరం లేదు. టీఆర్‌పీ కోసం చాలా మంది చాలా చెప్పారు. భారత క్రికెట్‌కు కోహ్లీ చేసిన కృషిని మనం అభినందించాలి. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ అద్భుతం. భారత జట్టులోనే అత్యంత ఫిట్‌నెస్ కలిగిన ప్లేయర్ అతను. నేను ఓ క్రికెటర్ శరీరంలోకి వెళ్లాలంటే విరాట్ కోహ్లీనే ఎంచుకుంటా.’అని గంభీర్ తెలిపాడు.భారత క్రికెట్ ఎవరి సొంత జాగీరు కాదని,140 కోట్ల భారతీయులదని గంభీర్ స్పష్టం చేశాడు. కొందరు మాజీ క్రికెటర్లు కామెంట్రీ ప్యానెల్‌లో కూర్చొని టీమిండియాను తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారని మండిపడ్డాడు. హెడ్ కోచ్‌గా తనపై వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోనని, దేశం గర్వపడేలా జట్టును తయారు చేయడమే తన లక్ష్యమని గంభీర్ స్పష్టం చేశాడు.

హెడ్ కోచ్
నేను ఆటలో రాజకీయాలను అస్సలు నమ్మను. భయం లేకుండా ఆడే జట్టును నిర్మించడానికి భారత కోచ్‌గా ఉన్నాను. నేను టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి 8 నెలలు మాత్రమే అవుతుంది. విమర్శలు తీసుకోవడానికి నేను సిద్దం. కామెంటేటర్లుగా వారి పనే అది. కానీ కొందరు 25 ఏళ్లుగా కామెంట్రీ బాక్స్‌లో కూర్చుంటూ, నేను చేసే ప్రతీ పనిని ప్రశ్నిస్తున్నారు. వారు భారత క్రికెట్‌ను తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారత క్రికెట్ ఎవరి సొంత జాగీరు కాదు.140 కోట్ల భారతీయులది.నా కోచింగ్, రికార్డ్స్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు నాకు లభించిన ప్రైజ్‌మనీని కూడా ప్రశ్నించారు. నేను డబ్బు ఎక్కడ దాచానో మరెక్కడ ఖర్చు చేశానో ఈ దేశానికి చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను ప్రశ్నించే కామెంటేటర్లు విదేశాల్లో ఉంటూ ఎన్‌ఆర్‌ఐలుగా చెలామణి అవుతున్నారు. ఈ దేశంలో డబ్బు సంపాదించి, పన్నులు ఎగవేయడానికి ఎన్ఆర్‌ఐలుగా మారిన వ్యక్తులను ఈ దేశం ప్రశ్నించాలి. నేను భారతీయుడిని, నా చివరి శ్వాస వరకు భారతీయుడిగానే ఉంటాను. పన్ను ఆదా చేయడానికి నేను ఎన్‌ఆర్‌ఐగా మారను. గాజు ఇళ్లలో నివసించే వారు ఇతరుల ఇళ్లపై రాళ్లు విసిరే ముందు లక్షసార్లు తమను తాము ప్రశ్నించుకోవాలి.’అని పేర్లు చెప్పకుండా మాజీ క్రికెటర్లకు గంభీర్ చురకలంటించాడు. సునీల్ గవాస్కర్‌ను ఉద్దేశించే గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.