జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అయితే ఈ భేటీకి ప్రధాని మోదీ గైర్హాజరయ్యారు. దీన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది. అంతటితో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా ఓ తల లేని ఫొటోను అధికారిక ఖాతా నుంచి పోస్ట్ చేసింది. దానిపై గాయబ్ అని రాసి ఉండగా ఇది చూసిన బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే మోసగాడిలా, వెన్నుపోటు పొడిచేవాడిలా కనిపించే రాహుల్ గాంధీని పోలిన ఫొటోను షేర్ చేసింది. ఇలా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
పూర్తి వివరాలు
ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో 26 మంది అమాయక పర్యటకులు ప్రాణాలు కోల్పోగా సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మధ్యలోనే ఇండియా తిరిగొచ్చారు. ఈ దాడిపై ఉన్నతాధికారులతో అత్యున్నత సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆ మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్నీ పార్టీలను ఆహ్వానిస్తూ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవ్వలేకపోయారు. అదే రోజు బిహార్‌లో జరిగిన మరో కార్యక్రమానికి వెళ్లారు.అఖిలపక్ష సమావేశానికి రాకుండా బిహార్ వెళ్లడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ఓ ఫొటోను షేర్ చేస్తూ “బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో గాయబ్” అనే క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేశారు. ఇందులో తలలేని మోదీ ఫొటో కనిపించింది. నేరుగా ఆయ ఫొటో, పేరు ప్రస్తావించకపోయినప్పటికీ,ఈ ఫొటో చూసిన ఎవరైనా సరే అది ప్రధాని మోదీయే అని గుర్తించేలా ఉంది. దీంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
లక్ష్యం
బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జీ అమిత్ మాలవీయ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్‌తో చేతులు కలిపిందని అందుకే అలాంటి పోస్టులు చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం ప్రధానిని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్ షేర్ చేసిన మోదీ ఫొటోకు రిప్లైగా రాహుల్ గాంధీ ఫొటోను షేర్ చేశారు. ఆయన లాంటి రూపం ఉన్న ఓ వ్యక్తి తెల్లరంగు టీషర్టు, టోపీ ధరించి కనిపించారు. అలాగే చేతుల్లో కత్తి పట్టుకుని దాన్ని వెనకకు పట్టుకున్న ఫొటోను అమిత్ మాలవీయ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ పాకిస్థాన్ స్నేహితుడు అని రాసుకొచ్చారు. ఇలా ఈ రెండు పార్టీల మధ్య ఫొటో వార్ కొనసాగుతోంది.
Read Also: Odisha: అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్న నిందితుడు