మనలో చాలామంది అలవాటుగా తడి టవల్స్‌ను, వాడిన దుస్తులను బెడ్‌పై వేసేస్తుంటాం. ఇవి సర్వసాధారణమైన విషయాలుగానే అనిపించవచ్చు. కానీ ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, ఇలాంటి అలవాట్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. తడి వస్తువులు బెడ్‌పై ఉంచినప్పుడు, ఆ తడి వల్ల దుప్పట్లు, పరుపు నెమ్మదిగా తడిగా మారతాయి. దాంతో వాతావరణానికి అనుకూలంగా క్రిములు, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయని వారు చెబుతున్నారు.
వాస్తవానికి, మన శరీరం నుంచి నిత్యం కొన్ని సూక్ష్మక్రిములు విడుదలవుతుంటాయి. వాడిన దుస్తులు బెడ్‌పై ఉంచితే, అవి ఆ క్రిములను పరుపుపైకి తీసుకువచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువసేపు మంచంపై గడిపే సమయంలో, ఈ క్రిములు చర్మ సమస్యలు, అలెర్జీలు, శ్వాస సంబంధిత వ్యాధులకు కారణమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇంతేకాకుండా, బయట తిరిగొచ్చిన వెంటనే కాళ్లు కడకుండానే మంచంపైకి చేరడం కూడా ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. బయట అడుగుపెట్టిన పాదాల్లో ఎంతో మలినాలు చేరే అవకాశం ఉంది. అవే నేరుగా బెడ్‌పై పడితే, అక్కడి పరిశుభ్రత దెబ్బతింటుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బెడ్‌ను శుభ్రంగా ఉంచడం, తడి వస్తువులు దూరంగా ఉంచడం, దుస్తులను సరిగా హ్యాంగ్ చేయడం ఎంతో ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.