పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ తన స్పోకెన్ ఇంగ్లీష్ విషయమై ఇటీవల తరచూ ట్రోలింగ్‌లకు గురవుతున్న విషయం తెలిసిందే. మ్యాచ్ కు ముందు, మ్యాచ్ తర్వాత అతడు మీడియాతో మాట్లాడే ఇంగ్లీష్ వీడియో క్లిప్స్‌ను కొందరు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తుంటారు. దాంతో రిజ్వాన్ ఇంగ్లీష్‌పై విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. అయితే తాజాగా తన ఇంగ్లీష్ భాషపై సోషల్ మీడియాలో వస్తోన్న ట్రోలింగ్‌పై స్పందించాడు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్. భావోద్వేగానికి కూడా గురయ్యాడు.నిన్నటి నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్ అయిన రిజ్వాన్ మీడియాతో మాట్లాడారు.ఆ సమయంలో తనకు ఇంగ్లీష్ రాదని సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించాడు.
నాణ్యమైన క్రికెట్
పీసీబీ, తన దేశం తన నుంచి నాణ్యమైన క్రికెట్‌ను మాత్రమే కోరుకుంటుందని అన్నాడు మహమ్మద్ రిజ్వాన్. ఇంగ్లీష్ కాదని పేర్కొన్నాడు. తనకు వచ్చిన భాషలోనే, నచ్చినట్టు మాట్లాడుతానని ఎవరేమనుకున్నా పట్టించుకోనని అన్నాడు. తన పని పాకిస్థాన్ కోసం నాణ్యమైన క్రికెట్ ఆడటమేనని, మంచిగా ఇంగ్లీష్ మాట్లాడటం కాదని వెల్లడించాడు. ఒకవేళ ఇంగ్లీష్ కావాలంటే, నేను క్రికెట్ వదిలేసి ప్రొఫెసర్ అవుతాను. కానీ ఇప్పుడు నాకు అంత టైమ్ లేదు. అయితే నేను నా చదువును పూర్తి చేసుకోలేకపోయాను. ఇప్పటికీ దాని గురించి బాధపడుతుంటాను. అందుకే ఇంగ్లీష్ మాట్లాడడంతో ఇబ్బంది పడుతుంటాను. నా జూనియర్స్ కు కూడా చదువును పూర్తి చేయండి అని చెబుతుంటాను. అప్పుడు వాళ్లు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు.” అని రిజ్వాన్ అన్నాడు.

ఇప్పటికీ బాధ
నా గురించి ఎవరేమన్నా అస్సలు పట్టించుకోను. నేనొక విషయంలో గర్వంగా ఫీలవుతా. ఏం మాట్లాడినా అది నా మనసులో నుంచే వస్తుంది. నాకు ఇంగ్లిష్ అంతగా తెలీదు. నేను సరిగ్గా, సరైన చదువును పూర్తి చేయలేదని ఇప్పటికీ బాధపడుతుంటాను. కానీ పాకిస్థాన్ కెప్టెన్‌గా రాణిస్తూ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నానని ఒక్క శాతం కూడా సిగ్గు పడను.” అని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.
Read Also: IPL 2025: ధోని జట్టు వ్యూహాలపై స్పందించిన మనోజ్ తివారీ