భారత్, శ్రీలంక మధ్య తొలిసారి ప్రతిష్టాత్మక రక్షణ సహకార ఒప్పందం జరిగింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, రాజధాని కొలంబోలో అధ్యక్షుడు దిసనాయకేతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ భేటీలో రక్షణ సహా పలు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు జరిగిన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేశాయి. అలాగే శ్రీలంకకు బహుళ రంగాల గ్రాంటును సులభతరం చేసే మరో ఒప్పందం కూడా జరిగింది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే వద్ద తమిళ జాలర్ల సమస్యను లేవనెత్తారు ప్రధాని మోదీ. తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాలని, వారి పడవలను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు.అంతకుముందు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన బిమ్‌సెక్ట్ సదస్సు ముగిసిన అనంతరం శ్రీలంక చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. కొలంబో నడిబొడ్డున ఉన్న చారిత్రక ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు దిసనాయకే ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. తర్వాత సైనిక గౌరవ వందనం స్వీకరించారు. లంక ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద ఓ విదేశీ అధినేతకు స్వాగతం లభించడం ఇదే ప్రథమమని విదేశాంగ శాఖ పేర్కొంది.
క్రికెటర్లతో భేటీ
ప్రధాని శ్రీలంక పర్యటన సందర్భంగా అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకేతో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ, 1996లో ప్రపంచ కప్ గెలిచిన శ్రీలంక సీనియర్ క్రికెటర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాగా ప్రధానమంత్రి మోదీ శ్రీలంక పర్యటన కోసం నిన్న సాయంత్రం బ్యాంకాక్ నుండి కొలంబో చేరుకున్నారు. ప్రపంచ కప్ గెలిచిన శ్రీలంక సీనియర్ క్రికెటర్లు సనత్ జయసూర్య, చమిందా వాస్, అరవింద డి. సిల్వా మార్వాన్ ఆటపట్టు, ఇతర శ్రీలంక క్రికెటర్లతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సంభాషించారు.శ్రీలంక క్రికెట్ స్టార్లతో కలిసి దిగిన ఫోటోలను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. “1996 ప్రపంచ కప్ గెలిచిన శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులతో సంభాషించడం చాలా ఆనందంగా ఉంది. ఈ జట్టు లెక్కలేనంత అభిమానులను సొంతం చేసుకుంది” అంటూ మోదీ పోస్ట్ చేశారు.
మార్చి 17న లాహోర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అర్జున రణతుంగ నేతృత్వంలోని జట్టు ఆస్ట్రేలియాను 22 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఓడించగలిగింది. అరవింద డి సిల్వా అజేయంగా 107 పరుగులు, అసంక గురుసిన్హా 99 బంతుల్లో 65 పరుగులు, అర్జున రణతుంగ 37 బంతుల్లో 47 పరుగులు చేయడం వల్ల శ్రీలంక తమ తొలి, ఏకైక ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోగలిగింది.క్రికెటర్ సనత్ జయసూర్య మాట్లాడుతూ,“ఇది మంచి సంభాషణ. మేము చాలా విషయాలు చర్చించాము. క్రికెట్ గురించి మాట్లాడాము. మోదీ ఎలా అధికారం చేపట్టారు.ఆయన దేశాన్ని ఎలా అభివృద్ధి చేసారో ఆసక్తికర విషయాలను మాట్లాడటం మాకు మంచి అనుభవం. ప్రధానమంత్రి మోదీ భారతదేశానికి ఏమి చేశారో ఆయన స్వయంగా వివరించారు” అని తెలిపారు.