పార్లమెంటులో జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ బిల్లు కు ఆమోదం లభించింది.దేశంలో ముస్లిం మైనారిటీల ఆస్తుల పరిరక్షణ కోసం రూపొందించిన వక్ఫ్ బిల్లుపై మొదటగా లోక్‌సభలో చర్చ ప్రారంభమై, ఆ తర్వాత రాజ్యసభ కు వెళ్ళింది. అధికార పక్షం,విపక్షాల మధ్య వాగ్వాదాలు, విమర్శలు, ప్రతివిమర్శల మధ్య ఈ చర్చలు కొనసాగాయి. ప్రత్యేకంగా రాజ్యసభలో ఈ చర్చ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగిన విషయం గమనార్హం.ఇలా అనేక బిల్లులపై సుదీర్ఘ చర్చలు జరిపిన చరిత్ర మన పార్లమెంటుకు ఉంది. ఓ బిల్లుపై గతంలో 20గంటల పాటు ఏకధాటిగా లోక్‌సభలో చర్చ జరిగినట్లు మేధోసంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వెల్లడించింది.
14 గంటలపాటు చర్చ
వక్ఫ్ బిల్లుపై లోక్‌సభలో 14 గంటలపాటు చర్చ జరగ్గా, రాజ్యసభలో చర్చ ప్రారంభమైన మరుసటి రోజు ఉదయం 4.02 గంటల వరకు కొనసాగింది. మొత్తంగా పెద్దల సభలో 17గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగిందని, రాజ్యసభ చరిత్రలోనే ఇదో అరుదైన విషయమని ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. అయితే, 1981లో రాజ్యసభలో ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ బిల్లుపైనా ఉదయం 4.43 గంటల వరకు చర్చ కొనసాగినట్లు నివేదికలు చెబుతున్నాయి.లోక్‌సభలో స్టేట్ ఆఫ్ అవర్ డెమోక్రసీపై గతంలో 20.08గంటల పాటు సాగిన చర్చే ఇప్పటివరకు సుదీర్ఘమైనది. ఆ తర్వాత 1993లో రైల్వే బడ్జెట్‌పై 18.35గంటల చర్చ జరిగింది. 1998లో రైల్వే బడ్జెట్‌పైనా 18.04 గంటలు, మైనార్టీల భద్రతకు సంబంధించి బిల్లుపై 17.25గంటలు, 1981లో ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ బిల్లుపై రాజ్యసభలో 16.58 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది.
రాష్ట్రపతి ఆమోదం
పార్లమెంట్ ఉభయసభలు వక్ఫ్ సవరణ బిల్లు ను ఆమోదించడంతో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది.వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై పార్లమెంట్ ఉభయసభల్లో సుదీర్ఘ చర్చ జరిగింది. లోక్‌సభలో 14గంటలకు పైగా చర్చ నడిచింది. అనంతరం, జరిగిన ఓటింగ్ ప్రక్రియలో బిల్లుకు అనుకూలంగా 288మంది వ్యతిరేకంగా 232మంది ఓటేశారు.దీంతో, వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. అనంతరం రాజ్యసభలోనూ వక్ఫ్ బిల్లుపై వాడివేడి చర్చ జరిగింది.బిల్లుకు అనుకూలంగా 128మంది వ్యతిరేకంగా 95మంది ఓటేశారు. దీంతో రాజ్యసభలో కూడా వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది.

వక్ఫ్ (సవరణ) బిల్లుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దముంటున్నాయి.అయితే, చట్టసభల్లో ఓడిన విపక్షాలు న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఏఐఎమ్ఐఎమ్, ఆమ్ ఆద్మీ పార్టీ వేర్వేరు పిటిషన్లతో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అంతేకాకుండా డీఎంకే టీఎంసీ, టీవీకే సహా దేశవ్యాప్తంగా విపక్షపార్టీలు నిరసన వ్యక్తంచేస్తున్నాయి..ఈ కొత్త చట్టంపై ఆల్-ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎమ్ పిఎల్ బి) కూడా నిరసనలు వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రచారాలు, నిరసనలు చేయాలని పిలుపునిచ్చింది.