ఈజిప్ట్‌కు సమీపంలోని ఎర్ర సముద్రంలో పర్యటక జలాంతర్గామి మునిగిపోవడంతో ఆరుగురు మరణించారని స్థానిక గవర్నర్ తెలిపారు. హర్ఘాదా నగరానికి సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఇందులో ఉన్న 39 మందిని రక్షించారు. వారిలో తొమ్మిది మంది గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సింద్‌బాద్ అనే ఆ జలాంతర్గామి నౌకాశ్రయానికి సమీపంలోనే మునిగిపోయింది. ఆ సమయంలో అందులో 45 మంది టూరిస్టులు ఉన్నట్లు భావిస్తున్నారు.
ఆ జలాంతర్గామిలో ఎవరున్నారు?
జలాంతర్గామి మునిగిపోయిన తరువాత ఆరుగురు పర్యటకులు మరణించారని, 39 మందిని రక్షించామని ఎర్ర సముద్రం ప్రాంత గవర్నర్ అమర్ హనాఫీ తెలిపారు. ఎవరూ గల్లంతు కాలేదని ఆయన అన్నారు. జలాంతర్గామిలో ఉన్న 45 మంది టూరిస్టులు రష్యా, ఇండియా, నార్వే, స్వీడన్‌లకు చెందినవారని, ఐదుగురు ఈజిప్షియన్లు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. మరణించిన వారందరూ రష్యాకు చెందినవారు. వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారని హర్ఘాదాలోని రష్యన్ అధికారి విక్టర్ వోరోపావ్ అన్నారు. మరో ఇద్దరు వైద్యులని రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ టాటార్‌స్తాన్ అధికారులు రష్యన్ మీడియాకు తెలిపారు. సబ్‌మెరైన్ ప్రమాదంలో మృతిచెందిన పర్యటకులందరూ రష్యన్లేనని ఈజిప్టులోని రష్యన్ రాయబార కార్యాలయం కూడా పేర్కొంది.

ఈ జలాంతర్గామి పనేంటి?
సింద్‌బాద్ అనేక ఏళ్లుగా పర్యాటక రంగంలో పని చేస్తోంది. హర్ఘాదా తీరప్రాంతానికి సమీపంలో ఉన్న పగడపు దిబ్బ (కోరల్ రీవ్స్) లను సందర్శించడానికి ఇది టూరిస్టులను తీసుకువెళుతుందని పర్యటక సంస్థ – సింద్‌బాద్ సబ్‌మెరైన్స్ వెల్లడించింది. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న 14 రిక్రియేషనల్ సబ్‌మెరైన్‌లలో రెండు తమ దగ్గరే ఉన్నాయని కంపెనీ చెబుతోంది. ఇందులో టూరిస్టుల కోసం 44 సీట్లు, పైలట్లకు రెండు సీట్లు ఉంటాయి. పెద్దలు, పిల్లలు ప్రయాణించేలా ఈ టూర్‌ను రూపొందించారని, నీటి అడుగున 25 మీటర్ల (82 అడుగులు) లోతు వరకు ఇవి టూరిస్టులను తీసుకువెళతాయని కంపెనీ వెబ్‌సైట్ పేర్కొంది. ”ప్రతి టూరిస్టుకు కిటికీ దగ్గర ఒక కుషన్ సీటును, వివిధ భాషల్లో సేఫ్టీ సందేశాలు వినిపించేలా ఏర్పాట్లు చేశారు.” అని గత నెలలో ఈ జలాంతర్గాములలో ఒకదానిలో ప్రయాణించిన డాక్టర్ జేమ్స్ ఆల్డ్రిడ్జ్ తెలిపారు.
‘‘ఆ నౌక ఇరుకుగా, రద్దీగా లేదు. నేను అభద్రతకు లోనుకాలేదు.” అని బ్రిస్టల్‌కు చెందిన డాక్టర్ ఆల్డ్రిడ్జ్ అన్నారు. తాను ప్రయాణించిన జలాంతర్గామి 25 మీటర్లకు మించి లోతుకు వెళ్ళలేదనీ, అయితే, ఇందులో ఎవరికీ లైఫ్ జాకెట్ ఇవ్వలేదని ఆల్డ్రిడ్జ్ చెప్పారు.
జలాంతర్గామి ఎక్కడ మునిగిపోయింది?
ఎర్ర సముద్రానికి సమీప నగరమైన హర్ఘాదా తీరంలో దాదాపు ఒక కిలోమీటరు (0.6 మైళ్లు) దూరంలో జలాంతర్గామి మునిగిపోయిందని తెలిసింది. ‘‘స్థానిక సమయం ప్రకారం ఉదయం 10:00 గంటలకు, తీరం నుంచి దాదాపు 0.6 మైళ్లు (1 కి.మీ) దూరంలో ఇది జరిగింది.’’ అని రష్యన్ రాయబార కార్యాలయం తెలిపింది.
హర్ఘాదా ఒక ప్రసిద్ధ పర్యటక కేంద్రం. బీచ్‌లు, పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. అనేక పర్యటక కంపెనీలు ఈ నౌకాశ్రయం నుంచి సర్వీసులు అందిస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో నగరం నుంచి బయలుదేరిన మరికొన్ని పడవలు కూడా ప్రమాదానికి గురయ్యాయి. నవంబర్‌లో, సీ స్టోరీ అనే పర్యటక పడవ మునిగిపోయి 11 మంది గల్లంతయ్యారు. ఒక బ్రిటిష్ జంటతో సహా 35 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
సబ్‌మెరైన్‌లో భద్రతా వైఫల్యాలవల్లే అది మునిగిపోయినట్టు ఆరోపణలు ఉన్నాయి.
గత ఐదు సంవత్సరాలలో ఈ ప్రాంతంలో “లైవ్‌ఏబోర్డ్” నౌకలకు సంబంధించిన 16 సంఘటనలు జరిగాయని, వాటిలో అనేక మరణాలు సంభవించాయని బ్రిటన్ పరిశోధకులు కొందరు గత నెలలో తెలిపారు.