టాలీవుడ్లో స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వార్ కొత్తది కాదు. ప్రత్యేకించి నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య పోటీ దశాబ్దాలుగా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో 34 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన బాలయ్య సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ మళ్లీ రీ-రిలీజ్ అవుతుండటం సినీ ప్రేమికుల్లో ఉత్సాహం నింపుతోంది.
ఇండియాలో తొలి సైన్స్ ఫిక్షన్ హిస్టారికల్ మూవీ
1991లో విడుదలైన ‘ఆదిత్య 369’ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో మొదటి సినిమాగా పేరొందిన ఈ చిత్రం శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా, కాల యంత్ర ప్రయాణం, విజ్ఞానపరమైన అంశాలు, భవిష్యత్తు చారిత్రక నేపథ్యాలను మిళితం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన తీరు ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా చేసింది. శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో ఆయన అపురూపమైన నటనను ప్రదర్శించగా, కృష్ణకుమార్ పాత్రలో ఆయన గంభీరమైన ప్రెజెన్స్ చూపించారు.
చిరంజీవి ప్రమోషన్‌తో అదనపు క్రేజ్
చిరంజీవి, బాలకృష్ణ పోటీ శిఖరాస్థాయికి చేరుకున్న సమయంలోనే ‘ఆదిత్య 369’ విడుదలైంది. అయితే, ఈ సినిమాపై అందరి దృష్టిని తీసుకురావాలనుకున్న నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని ప్రమోషన్ చేయాలని అడగగా, చిరు కూడా దానికి ఒప్పుకున్నారు.“ఈ సినిమా తెలుగువారందరికీ గర్వకారణం, తప్పక చూడండి” అంటూ చిరు ఇచ్చిన పిలుపు ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది.

రీ-రిలీజ్‌పై అంచనాలు
ఈ క్లాసిక్ సినిమా ఏప్రిల్ 4న కొత్త సాంకేతిక హంగులతో 4K ఫార్మాట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రీ-రిలీజ్ ప్రకటనతో నందమూరి అభిమానులు ఇప్పటికే భారీ ప్రచారాన్ని ప్రారంభించారు. సమకాలీన సాంకేతికతతో మరింత విజువల్ ట్రీట్‌గా ఈ సినిమా కొత్త తరం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించగలదో చూడాలి.మొత్తంగా, ‘ఆదిత్య 369’ 34 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయబోతుండటం సినీ ప్రేమికులకు ఓ పండుగ వంటిదనే చెప్పొచ్చు.
టైమ్ మిషన్
ఈ మూవీలో హీరో హీరోయిన్లు టైమ్ మిషన్ ఎక్కి భూతకాలంలో విజయనగర సామ్రాజ్యంలోకి వెళతారు. అక్కడ వారికి శ్రీకృష్ణదేవరాయలు భువన విజయం కనిపిస్తుంది. ఆ తర్వాత జరిగిన ఘటనలో రాయలవారే కృష్ణకుమార్‌కి ఉరిశిక్ష విధించడం.ఆ తర్వాత జరిగిన తప్పు తెలుసుకుని మారువేశంలో ఆయనే రక్షించడం కథను ముందుకునడిపిస్తుంది. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు పాత్రకు ఎన్టీఆర్ నటవారసుడైన బాలకృష్ణ మాత్రమే న్యాయం చేయగలరని అందరూ భావించారు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అడగ్గానే బాలయ్య కూడా మరోమాట లేకుండా సినిమాను అంగీకరించారు.