హైదరాబాద్: స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. కేటీఆర్‌కు దళితులపై ఎంత ప్రేమ ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దళితులకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు స్పీకర్‌ను ఆ పార్టీ అవమానించిందన్నారు.

దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు
పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న మీరు స్పీకర్‌కు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకోవాలి. దళిత స్పీకర్‌ను అవమానించి, అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తాననడం సిగ్గుచేటు. కేటీఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు. రెచ్చగొట్టేలా మాట్లాడి అసెంబ్లీని స్తంభింపజేస్తున్నారు అని చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఉద్యమం టైం నుండే మీ నాయన దళితులను మోసం చేస్తున్నాడు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సార్లు దళితులను అవమానించారు. ఆనాడు నామ మాత్రంగా రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేసి బర్తరఫ్ చేశారు. కారణాలు ఏంటో ఇప్పటికీ చెప్పలేదు అని ఎంపీ వెల్లడించారు.
స్పీకర్ మీద కూడా సీరియస్
కాగా, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే సందర్బంగా శాసనసభలో గందగోళం నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ చేయడంపై ఆయన గరం అయ్యారు. ఈ క్రమంలోనే స్పీకర్ మీద కూడా సీరియస్ అయ్యారు. దీంతో ఆయన్ను సభ నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆమరణ నిరహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు.